ఇంటికి చేరుకున్న ఆనందయ్య.. మందు పంపిణీకి దక్కని అనుమతి

By telugu news teamFirst Published May 29, 2021, 7:40 AM IST
Highlights

ఆయన తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో మళ్లీ ఆయనను తీసుకువెళతారేమోనని గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఆనందయ్య.. ఈ పేరు ఒక నెలరోజుల కిందట చెబితే.. ఎవరాయన అని అడిగేవారేమో. కానీ.. ఇప్పుడు కాదు. కరోనా మందు పంపిణీ చేస్తూ... అది కూడా చాలా మందిలో పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం.. దాని కోసం వేల మంది ఆయన ఇంటి వద్దకు క్యూలు కట్టడంతో.. ఆనందయ్య ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయాడు. ఆయన మందు పనితీరు సరిగా ఉందా లేదా అనేదానిపై పరిశోధనలు కూడా మొదలయ్యాయి.

కాగా.. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా.. వదిలేశారు. ఆయన తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో మళ్లీ ఆయనను తీసుకువెళతారేమోనని గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ నెల 21వ తేదీ చివరగా ఆయన మందు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆనందయ్య పోలీసుల రక్షణలోనే ఉన్నారు. ఇంటికి కూడా వెళ్లలేదు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం స్వగ్రామానికి రాగానే.. పోలీసులు అక్కడకు చేరుకొని ఆయనను సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించారు. అనుమతి ఇచ్చేవరకు ఎలాంటి మందు తయారు చేయడం కానీ.. పంపిణీ చేయడం కానీ చేయకూడదని ఆయనకు అధికారులు సూచించారు.

ఇంటికి చేరుకున్న తర్వాత ఆనందయ్య తన గ్రామస్థులతో మాట్లాడారు. తాను ఎక్కడికీ వెళ్లనని.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. మళ్లీ మందు తయారు చేస్తానని చెప్పారు. ముందుగా తన గ్రామంలోని వారందరికీ ఇస్తానని చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా.. ఆనందయ్య ఇంటికి చేరుకోవడంతో కృష్ణపట్నంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సీఐ, పది మంది ఎస్ఐ లు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన రహదారులు మినహా.. అన్ని రోడ్లలో బారికేడ్లు పెట్టారు.

గ్రామంలోకి స్థానికులను గుర్తింపు కార్డు చూసి అనుమతిస్తున్నారు. ఇతరులను రానివ్వడం లేదు. కృష్ణపట్నంలో 144సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆనందయ్య తయారు చేసిన ఔషధం వినియోగంపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. 
 

click me!