పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి: ఒంటి గంట నుంచి విచారణ

By telugu teamFirst Published Jun 20, 2020, 10:31 AM IST
Highlights

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో వారిని పోలీసులు విచారించనున్నారు.

అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. వారిద్దరిని కోర్టు రెండు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు ఈ నెల 13వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 22వ తేదీ ఒంటి గంట వరకు విచారించనున్నారు. వారిని విచారించడానికి అనంతపురం పోలీసులు కడప రానున్నారు. కడప వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో వారిద్దరిని పోలీసులు విచారించనున్నారు. 

Also Read: జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్... బెయిల్ నిరాకరణ

వారిద్దరిని ఈ నెల 13వ తేదీన అరెస్టు చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న వారిద్దరిని అనంతపురం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని న్యాయవాదుల సమక్షంలో విచారించనున్నారు. 

144 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.  ఇదిలావుంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వారిద్దరు ఆన్ లైన్ లో కోర్టుకు నివేదించుకున్నారు. 

Also Read: నా బిజినెస్ దెబ్బతీస్తున్నారు, నన్ను టార్గెట్ చేశారు: జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి

ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం కోర్టు వారిద్దరినీ విచారించింది. మరో మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పీటీ వారంట్ మీద కస్టడీకి కోరారు. దాంతో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.

click me!