రాష్ట్రవ్యాప్తంగా జూన్ లో కరోనా మరణాల పెరుగుదల...కారణమిదే: ఏపి సీఎస్

By Arun Kumar PFirst Published Jun 19, 2020, 10:26 PM IST
Highlights

జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ తప్పక కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

అమరావతి: జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ తప్పక కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ... కరోనా వైరస్ నియంత్రణలో జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారం ఇవ్వడం జరిగిందన్నారు. గత మూడు మాసాలుగా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ వైరస్ నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనా నివారణలో ఇప్పటి వరకూ జిల్లా కలెక్టర్లు ఇతర యంత్రాంగం చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా  అభినందించారు.ఇప్పటి వరకూ చేసిన కృషి వృధా కాకుండా వైరస్ ను ఏవిధంగా మరింత కట్టడి చేయాలనే దానిపై దృష్టి సారించాలని ఆదేశించారు.

కృష్ణా,గుంటూర్, కర్నూల్ జిల్లాలో రోజుకు 3వేల వరకూ కరోనా పరీక్షలు చేయాలని సిఎస్ నీలం సాహ్ని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాల్లో రోజుకు 1000 నుండి 1500 మందికి టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా టెస్టింగ్ ల్యాబ్ లను అన్నివిధాలా మెరుగైన రీతిలో పనిచేసేలా చూడాలని అన్నారు. 

ఆసుపత్రుల సన్నద్ధత గురించి ఆమె మాట్లాడుతూ డిసిహెచ్ఎస్, సూపరింటెండెంట్ లతో నిరంతరం  పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రాధమిక, సెకండరీ సర్వే లెన్స్ బృందాలు ద్వారా కరోనా లక్షణాలు ఉంటే టెస్టులు, చికిత్సలకై ఎక్కడకు వెళ్ళాలనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. ఇందుకోసం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పారు.

ఈప్రైమరీ,సెకండరీ సర్వే లెన్స్ బృందాలు మరింత చురుగ్గా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ను ఆదేశించారు. గతంతో పోలిస్తే ఈనెలలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య పెరిగిందని అందుకు  వైరస్ వ్యాప్తే కారణమని తెలిపారు.మరణాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

విజయవాడ ఎపిటిఎస్ కేంద్రం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని అన్నారు. ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించేలా చూడాలని చెప్పారు. డ్వాక్రా సంఘాల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఐఇసి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకూ కరోనా వైరస్ నియంత్రణకు జిల్లాలో వారీగా చేపట్టిన చర్యల ప్రగతిని వివరించారు. ముఖ్యంగా ఈనెలలో ఇప్పటి వరకూ నిర్వహించిన టెస్టులు, వలస కూలీలకు నిర్వహించిన టెస్టులు, వివిధ ల్యాబ్ ల్లో కరోనా టెస్టుల నిర్వహణ సామర్ధ్యం తదితర అంశాలపై వివరించారు. 

click me!