
అమరావతి : రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి Mekapati Goutham Reddy హఠాన్మరణంపై ముఖ్యమంత్రి YS Jagan తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే అయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.విసుబ్బారెడ్డి, చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాలోమన్ ఆరోకియా రాజ్, రేవు ముత్యాలరాజు, ధనుజంయ్ రెడ్డిలతో ముఖ్యమంత్రితో తన నివాసంలో సమావేశమయ్యారు. గౌతంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయమంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు.
ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషిచేశారని. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకు వచ్చారని సీఎం అన్నారు.
రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొంది ఉజ్వలభవిష్యత్తు ఉన్న నాయకుడ్ని కోల్పోయానని ఆవేదనవ్యక్తంచేశారు. గౌతం రెడ్డి మరణం తనకే కాదు, రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. వెంటనే ఆయన గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. నేరుగా హైదరాబాద్ చేరుకుని మంత్రి మేకపాటి నివాసానికి చేరుకుంటారు. అక్కడే ఆయనకు నివాళులు అర్పిస్తారు.
అంతేకాదు, మంత్రి గౌతంరెడ్డి మరణంతో 2 రోజులపాటు సంతాప దినాలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. సంతాప సూచకంగా జాతీయపతాకాన్ని అవనతం చేస్తారు.
కాగా, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో మరణించిన మేకపాటి భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం ఇక్కడి నుంచి స్వస్థలం నెల్లూరు జిల్లాకు ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఎల్లుండి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
గౌతంరెడ్డి మృతికి ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన, ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రి హరీష్ రావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు సంతాపం వ్యక్తం చేశారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. మేకపాటి వయస్సు 49 సంవత్సరాలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకెలో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందారు.