శ్రీకాకుళం జిల్లాలో విషాదం... కరెంట్ షాక్ గురయి ఇద్దరు యువకులు మృతి

By Arun Kumar PFirst Published Aug 13, 2021, 11:00 AM IST
Highlights

అడవి పందుల బెడద నుండి పంటను కాపాడుకోడానికి ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలను అమర్చుకోగా అవి తాకి ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

శ్రీకాకుళం: అడవిజంతువుల నుండి పంటను కాపాడుకోడానికి చేసిన ప్రయత్నం ఇద్దరు యువకుల ప్రాణాలను తీసింది. కరెంట్ తీగలు తాకి షాక్ కు గురయి యువకులిద్దరు చనిపోయారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొనుటూరు గ్రామానికి చెందిన ఓ రైతు పండిస్తున్న పంటను అడవిజంతువులు ముఖ్యంగా అడవిపందులు నాశనం చేస్తున్నాయి. దీంతో వీటి బెడదను తప్పించేందుకు పొలం చుట్టూ కరెంట్ తీగలను అమర్చాడు. నిత్యం తీగల్లో కరెంట్ సప్లై అవుతుండటంతో అడవిపందుల బెడద తప్పింది. 

read more  నోట్లో గుడ్డలు కుక్కి... తొమ్మిదేళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడు అత్యాచారం

అయితే పొలం చుట్టూ విద్యుత్ తీగలున్న విషయం తెలియక ఇద్దరు యువకులు అటువైపు వెళ్లారు. దీంతో పొలానికి రక్షణగా ఏర్పాటుచేసిన కరెంట్ తీగలు తగిలి ఇద్దరూ షాక్ కు గురయ్యారు. చుట్టుపక్కల కాపాడేవారు ఎవ్వరూ లేకపోడంతో చాలాసేపు కరెంట్ షాక్ తో విలవిల్లాడుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు.

పొలంగట్టున ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులిద్దరు కొత్తగూడకు చెందిన ఆకాష్, విలియంగా గుర్తించారు. వారి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

click me!