దుర్గమ్మ వెండి సింహాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

By Siva KodatiFirst Published Jan 23, 2021, 8:45 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దుర్గ గుడి రథం వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసును బెజవాడ పోలీసులు ఛేదించారు. ఈ  కేసులో ప్రధాన నిందితుడు సాయిబాబాతో పాటు బంగారం వ్యాపారి కమలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దుర్గ గుడి రథం వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసును బెజవాడ పోలీసులు ఛేదించారు. ఈ  కేసులో ప్రధాన నిందితుడు సాయిబాబాతో పాటు బంగారం వ్యాపారి కమలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది సెఫ్టెంబర్ 17న దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల వెండి రథంలోని నాలుగు వెండి సింహాల్లో మూడు సింహాలు మాయమైనట్లు ఫిర్యాదు అందిందని ఆయన పేర్కొన్నారు.

కానీ జూలైలో దొంగతనం జరిగినట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి 150 మందిని విచారించామని శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయిబాబాది భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన వ్యక్తిగా సీపీ చెప్పారు.

గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాలలోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు సాయిబాబా.. 2012లో చివరిసారిగా పోలీసులకు పట్టుబడ్డాడని బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడని సీపీ వెల్లడించారు. సాయితో పాటు బంగారం వ్యాపారి ముత్తా కమలేష్‌ను కూడా అరెస్టు చేశామని, చోరికి గురైన మొత్తం వెండితో పాటు మిగతా ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 6.4 కేజీల వెండిని రికవరి చేశామని సీపీ తెలిపారు.

ఇటువంటి సున్నితమైన అంశాలపై ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలని బత్తిన శ్రీనివాసులు హితవు పలికారు. కమిషనరేట్ పరిధిలో దేవాలయాల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాం.

దేవాలయాలపై దాడులకు పాల్పడేవారిని అడ్డుకోవడంలో ప్రజల సహకారం కీలకమని సీపీ స్పష్టం చేశారు. వెండి సింహాల చోరీ కేసును చేధించిన ఏసీపీ హనుమంతరావు, సీఐ పి.వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ లకు రివార్డులు అందిస్తామని చెప్పారు.
 

click me!