తుత్తూకుడి జిల్లా కలెక్టర్ గా తెలుగు వ్యక్తి: ఎవరీ నండూరి సందీప్?

Published : May 24, 2018, 02:11 PM IST
తుత్తూకుడి జిల్లా కలెక్టర్ గా తెలుగు వ్యక్తి: ఎవరీ నండూరి సందీప్?

సారాంశం

తుత్తూకుడి జిల్లా కలెక్టర్ గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. నండూరి సందీప్ గురువారం తుత్తూకుడి జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

చెన్నై: తుత్తూకుడి జిల్లా కలెక్టర్ గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. నండూరి సందీప్ గురువారం తుత్తూకుడి జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తుత్తూకుడి ప్రస్తుతం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో జిల్లా కలెక్టర్ ఎన్ వెంకటేశన్ ను, ఎస్పీ పి. మహేంద్రన్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటేశన్ స్థానంలో నండూరి సందీప్ జిల్లా కలెక్టర్ గా వచ్చారు. 

నండూరి సందీప్ 2009 ఐఎఎస్ బ్యాచ్ తమిళనాడు క్యాడర్ కు చెందినవారు. ఆయన కార్పోరేట్ ప్రపంచం నుంచి ప్రజా సేవా రంగానికి వచ్చారు. ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపిఎస్ అధికారిగా పనిచేశారు. 

యుపిఎస్సీ తొలి ప్రయత్నంలో ఆయన ఐఆర్ఎస్ కు ఎంపికయ్యారు. అందులో చేరిన తర్వాత రెండోసారి యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి 91వ ర్యాంక్ సాధించాడు. ఆయన తొలి పోస్టింగ్ హోసూరు సబ్ కలెక్టర్. మదురై నగరపాలక సంస్థ కమిషనర్ గా కూడా పనిచేశారు.

అతన్ని సన్నిహితులు సాండీగా పిలుస్తారు. ఆయన తండ్రి మదన్ మోహన్ నండూరి పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేశారు. తల్లి విజయలక్ష్మి గృహిణి. 

సందీప్ భార్య అద్యాశ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఎకె పరీదా కూతురు. సందీప్, అద్యాశ దంపతులకు సమర్థ్ అనే కుమారుడు ఉన్నాడు. అద్యాశ, సందీప్ కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. సందీప్ ఎంబిఎ పూర్తి చేసిన తర్వాత వివాహం చేసుకున్నారు. 

సందీప్ హైదరాబాదులోని వాసవి కాలేజీలో బిటెక్ చదివారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎంలో ఎంబిఎ పూర్తి చేశారు. హెచ్ పిలో సేల్స్ మేనేజర్ గా కూడా పనిచేశారు. సివిల్ సర్వీసెస్ కు చదవడానికి ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 

ఇప్పటి వరకు తిరునెల్వేలీ కలెక్టర్ గా ఉన్న సందీప్ వినూత్నమైన పథకాన్ని అమలు చేశారు. ప్రజల నుంచి వారికి అవసరం లేనివాటిని విరాళంగా స్వీకరించి వాటి అవసరం ఉన్నవారికి అందజేసే పథకం అది. విరాళాలను వేయడానికి కలెక్టర్ కార్యాలయం గోడలో ఓ కప్ బోర్డు పెట్టించారు దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు, మొదలైనవాటిని ప్రజలు విరాళంగా ఇస్తూ వచ్చారు. అవసరం ఉన్నవారు వాటిని తీసుకునే సౌకర్యం కూడా కల్పించారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu