సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

By Siva KodatiFirst Published Jul 1, 2022, 9:57 PM IST
Highlights

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ధర్మారెడ్డి వెల్లడించారు. ఆ సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు వుండవని ఆయన తెలిపారు

కోవిడ్ మహమ్మారి (coronavirus) గడిచిన రెండేళ్లుగా అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. విద్య, వైద్యం, ఉపాధి, ఆరోగ్యం, ఆర్ధిక రంగాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలపైనా పెను ప్రభావం చూపింది. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని దేవాలయాల్లో ఆంక్షలను విధించింది ప్రభుత్వం. అయితే దేశవ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడుతుండటంతో ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (tirumala) శ్రీవారిపైనా కరోనా ప్రభావం చూపింది. ఒకానొక దశలో బ్రహ్మోత్సవాలను సైతం ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది. కేసులు తగ్గినా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ (ttd) . 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్ధితులు నెలకొనడంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను (salakatla brahmotsavam 2022) వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను టీటీడీ ఏవో ధర్మారెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ధర్మారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 27 సాయంత్రం ధ్వజరోహణ కార్యక్రమం జరుగుతుందని.. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వర్ణ రథోత్సవం, అక్టోబర్ 4న రథోత్సవం , అక్టోబర్ 5న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ధర్మారెడ్డి తెలియజేశారు. ఆ సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు వుండవని ఆయన తెలిపారు. 

ALso Read:టీటీడీ ఈవోకు హైకోర్టు నోటీసులు..

కాగా... తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 8న జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న ఇన్‌ఛార్జి ఈవో ఏవీ ధర్మారెడ్డి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్‌, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే దేవస్థానాల మేనేజ్‌మెంట్‌ కమిటీకి నోటీసులు జారీచేసింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ మాట్లాడుతూ.. ఈ వ్యవహారం సర్వీసు అంశమా? లేదా ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలా? అనే విషయంపై సందేహం ఉందన్నారు. ముందుగా ఆ విషయంపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి సూచించారు.  విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ తిరుపతికి చెందిన పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఏపీ దేవాదాయచట్టం సెక్షన్‌ 107 ప్రకారం జిల్లా కలెక్టర్‌ లేదా ఆ ర్యాంక్‌కు తగ్గని అధికారిని మాత్రమే తితిదే ఈవోగా నియమించాల్సి ఉందన్నారు. ఈవో పోస్టు నిర్వహించేందుకు ధర్మారెడ్డికి అర్హత లేదన్నారు.
 

click me!