వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ, త్వరలో జనసేనలోకి రంగా తనయుడు ...?

By Siva KodatiFirst Published Jul 1, 2022, 6:29 PM IST
Highlights

విజయవాడ రాజకీయాల్లో కీలక నేత, దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ కావడం ఏపీలో కలకలం రేపుతోంది. 

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఆదివారం ఎన్‌బీవీకే భవన్ లో జనసేన జనవాణి కార్యక్రమ వుంది. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిన మనోహన్ పక్కనే వున్న వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లారు. నాదెండ్లతో వంగవీటి రాధా ప్రస్తుత రాజకీయ పరిణామాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం టీడీపీలో వున్న వంగవీటి రాధా.. గత కొంతకాలంగా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. జూలై 4న తన తండ్రి దివంగత వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా ఆయన జనసేన తీర్ధం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రోజున విజయవాడ బందర్ రోడ్ లోని రంగా విగ్రహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పుడే పవన్ సమక్షంలో వంగవీటి రాధా.. జనసేన పార్టీ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రాధా వర్గం గానీ, జనసేన శ్రేణులు కానీ ఖండించకపోవడం.. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఏకంగా వంగవీటి ఇంటికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. మరి జూలై 4న విజయవాడలో ఏం జరగనుందో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.. 

click me!