తిరుమల కొండపై ఇక డ్రోన్ల ఆటకట్టు.. యాంటీ డ్రోన్ టెక్నాలజీని అమర్చనున్న టీటీడీ

By Siva KodatiFirst Published Jul 23, 2021, 5:45 PM IST
Highlights

డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా డ్రోన్ జామర్ టెక్నాలజీని తిరుమల కొండపైన ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గత కొన్నిరోజులుగా సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. జమ్మూలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రక్షణపై మరోసారి ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా డ్రోన్ జామర్ టెక్నాలజీని తిరుమల కొండపైన ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పరిణామాల నేపథ్యంలో భద్రతా సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానంను అప్రమత్తం చేశాయి. దీంతో డ్రోన్ల దాడులను నివారించేందుకు గాను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ సహాయంతో తిరుమలలోని వెంకటేశ్వర ఆలయ రక్షణ వ్యవస్థలో ఉపయోగించనున్నారు.

డీఆర్‌డీవో సహకారంతో యాంటీ-డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్న ఘనత దేశంలో మొట్టమొదటి సారి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి దక్కుతుంది. జమ్ములోని ఒక వైమానిక దళంపై ఉగ్రవాద దాడి తరువాత..యాంటీ డ్రోన్ టెక్నాలజీని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. కర్ణాటకలోని కోలార్ వద్ద జూలై 6 న మూడు రకాల టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు శాఖల ప్రతినిధులతోపాటు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ చీఫ్, గోపీనాథ్ జట్టి హాజరయ్యారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం టీటీడీ రూ. 22 కోట్లు వెచ్చించనుంది.

ALso Read:జమ్మూలో పాకిస్తాన్ డ్రోన్ కలకలం.. పేల్చివేసిన అధికారులు..

ఇక డి-4 డ్రోన్‌ వ్యవస్థగా పిలిచే దీని ద్వారా డ్రోన్‌ దాడుల ముప్పు నుంచి రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చు. నాలుగు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను ఈ వ్యవస్థ గుర్తించి దాడి చేస్తుంది. అత్యంత కీలక ప్రాంతాలపై దాడి చేసే డ్రోన్లను ఇది ప్రధానంగా గుర్తించి ధ్వంసం చేస్తుంది. డి-4 డ్రోన్‌ వ్యవస్థలో అనేక సెన్సార్లు, డ్రోన్లపై ఎదురు దాడి చేసే రెండు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ డ్రోన్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌ను జామ్ చేయడంతో పాటు డ్రోన్‌ల హార్డ్‌వేర్‌ను నాశనం చేస్తుంది.

click me!