
ప్రస్తుతం తిరుమలలో వున్న బ్లడ్ బ్యాంక్ తరహాలోనే ఐ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ శుక్రవారం భక్తులతో డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులతో సంభాషించిన సందర్భంగా దృష్టి లోపం వున్న వారి కోసం టీటీడీ నేత్రదానం ట్రస్టును ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
కంటి సంబంధిత వ్యాధులతో నిరుపేదలకు సాధ్యమైనంత ఉత్తమ సేవలను అందించడం కోసం తాము ఇప్పటికే అరవింద్ ఐ కేర్ హాస్పిటల్‌లతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈవో తెలిపారు. త్వరలోనే ఐ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అత్యాధునిక స్పెషాలిటీ ఆసుపత్రులు, యూనివర్సిటీలను నెలకొల్పడం ద్వారా వైద్య ఆరోగ్యానికి , పరిశోధనలకు టీటీడీ విశేష కృషి చేసిందని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
Also Read: వరుస సెలవులు.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో 85 శాతం వసతితో పాటు శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం సామాన్య భక్తులకు ప్రతిరోజూ 15 గంటల సమయం కేటాయించామని ఈవో తెలిపారు. రోజులో అందుబాటులో వున్న 18 గంటల సమయంలో వీఐపీలకు మూడు గంటల సమయం మాత్రమే ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో వేసవి రద్దీ ప్రారంభం కానున్న నేపథ్యంలో జూలై 15 వరకు వీఐపీ సిఫారస్సులు , ఇతర చెల్లింపు, ప్రత్యేక దర్శనాలను తగ్గించాలని టీటీడీ నిర్ణయించినట్లు ఈవో చెప్పారు. దీని వల్ల సామాన్య భక్తులు సులభంగా దర్శనం పొందడానికి వీలు కలిగిస్తుందన్నారు.
తిరుమలలోని వసతి గృహాల కౌంటర్లలో టీటీడీ అమలు చేస్తోన్న ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ మెరుగైన ఆక్యుపెన్సీ , వేకెన్సీ రేషియోలతో పాటు ఆదాయపరంగానూ మంచి ఫలితాలను ఇస్తోందని ఈవో చెప్పారు. ఈ ఏడాది మార్చిలో హుండీ వసూళ్ల ద్వారా టీటీడీకి 120.29 కోట్లు వచ్చాయని.. ఈ నెలలో 20.57 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ జాయింట్ ఈవోలు సదా భార్గవి, వీ వీరబ్రహ్మం, పీఆర్‌వో తలారి రవి తదితరులు పాల్గొన్నారు.