
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఫిర్యాదు చేశారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రిని కలిశారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఇళ్ల పరిస్థితిని చూడాలని కోరారు. కేంద్రం 32 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 32 వేల ఇళ్లే కట్టారని సోము ఆరోపించారు. చివరికి సర్పంచ్‌ల ఖాతాల్లోని డబ్బును కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.
ఏపీలో ఇళ్ల నిర్మాణాల్లో పొరపాట్లు, అలసత్వం జరుగుతోందని.. దీనిపై ఆరా తీసి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. కేంద్ర సహకారంతో కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేస్తున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో లేని గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన బోర్డు లేదని సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఇదిలావుండగా.. సోము వీర్రాజు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నట్టుగా తెలుస్తోంది.