ప్రధానార్చకులను, ఇతరులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టిటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రమణదీక్షితులు తిరిగి ప్రధానార్చకుడిగా చేరనున్నారు.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్ అయిన ప్రధానార్చకులను, మిగతావారిని తిరిగి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరుమల శ్రీవారి ప్రధానార్చకుడిగా రమదీక్షితులు తిరిగి చేరనున్నారు. రమణదీక్షితులుతో పాటు మరో ముగ్గురు ప్రధానార్చకులు నారాయణమూర్తి దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నరసింహ దీక్షులు ప్రధానార్చకులుగా చేరనున్నారు.
వారితో పాటు మరో ఐదుగురు కూడా తిరిగి చేరనున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న ప్రధానార్చకుల పరిస్థితిపై సందిగ్ధత నెలకొంది. వారి గురించి టీటీడీ తన ఆదేశాల్లో ఏ విషయమూ చెప్పలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న నలుగురు ప్రధానార్చకులు తిరిగి తమ అర్చక హోదాల్లోకి మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
undefined
శ్రీవారి సేవలో ఉన్న అర్చకులకు వయో పరిమితి విధిస్తూ 2018 మే నెలలో టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 65 ఏళ్లు పైబడివారంతా రిటైర్ అయ్యారు. అయితే, తిరుచనూరు ప్రధానార్చకుడితో పాటు మరో అర్చకుడు టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. దీంతో వారిని తిరిగి నియమించాలని ఆదేశిస్తూ కోర్టు 2018 డిసెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది. వారి విషయంలో కోర్టు తీర్పును తమకు కూడా అమలు చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రమణదీక్షితులు వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. న్యాయం చేస్తామని ఆ సమయంలో జగన్ హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రమణదీక్షితులు వైఎస్ జగన్ కు ఆ విషయాన్ని విన్నవించారు ఈ స్థితిలో రమణదీక్షితులకు గౌరవ ప్రధాన అర్చక హోదా కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే, రమణదీక్షితులు దాన్ని అంగీకరించకుండా రిటైర్మెంట్ అయిన అర్చకులందరికీ కోర్టు ఉత్తర్వుల మేరకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో టీటీడీ వయోపరిమితి నిబంధనను రద్దు చేస్తూ వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.