నీలం సాహ్నీకి షాక్: ఏపీ పరిషత్ ఎన్నికలపై జనసేన హౌస్ మోషన్ పిటిషన్

By telugu teamFirst Published Apr 3, 2021, 11:22 AM IST
Highlights

ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జనసేన విమర్శించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నీలం సాహ్ని నోటిఫికేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఏపీ ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ జనసేన పిటిషన్ దాఖలు చేసింది. కాగా, బిజెపి శుక్రవారంనాడే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జనసేన విమర్శించింది. ఎస్ఈసీ తీరుకు నిరసనగా జనసేన ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశాన్ని కూడా బహిష్కరించింది. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది.

గతంలో జడ్పీటీసీ. ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిన చోటు నుంచే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నియమించింది. గతంలో చేపట్టిన ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు నీలం సాహ్ని అంగీకరించలేదు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందని, అక్రమాలు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. బిజెపి మాత్రం తాము ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పింది. 

ఇంతకు ముందు జనసేన దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు విచారణ ముగించి తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అది అలా ఉండగానే నీలం సాహ్ని ఎన్నికలకు నోటిపికేషన్ జారీ చేశారు.

click me!