విమర్శల వెల్లువ: సంప్రదాయ భోజనంపై వెనక్కి తగ్గిన టీటీడీ వివరణ

By telugu teamFirst Published Aug 30, 2021, 10:18 AM IST
Highlights

తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని టీటీడీ వెనక్కి తీసుకుంది. సంప్రదాయ భోజనాన్ని ఇటీవల ఈవో జవహర్ రెడ్డి స్వీకరిస్తూ దాన్ని అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

తిరుపతి: సంప్రదాయ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెనక్కి తగ్గింది. విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలనే నిర్ణయంపై పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ భోజనాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని ఆయన అన్నారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కరోనా వైరస్ కారణంగా సర్వదర్శనాలు ఆపేశామని, కొంత మందికైనా సర్వదర్శనం కల్పించాలనేది తన అబిమతమని ఆయన చెప్పారు. అధికారులతో చర్చించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.  

Latest Videos

ఇదిలావుంటే, సంప్రదాయ భోజనంపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.  తిరుమలలో నిత్య అన్నదాన్నం నిరంతరాయంగా కొనసాగుతుందని, దీంతోపాటు టీటీడీ పరిధిలో వేలం ద్వారా అనేక క్యాంటీన్ లు నడుపుతున్నారని, వాటిలో 10 బిగ్ క్యాంటీన్లు,7 జనతా క్యాంటీన్లు, 148  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 128 టి స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీటికిప్రతినెలా లైసెన్స్ ఫీజ్ కడుతుంటారని చెప్పింది.

ప్రయోగాత్మకం గా టీటీడీ ఒక పెద్ద క్యాంటీన్ లో భక్తులకు  సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేయాలని యోచిస్తోందని,  ఇది విజయవంతమైతే ఒక క్యాంటీన్ లో మాత్రమే భక్తులకు సంప్రదాయ భోజనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. సాధ్యాసాధ్యాలను బట్టి నెమ్మదిగా మిగతా క్యాంటీన్ లను టీటీడీ నిర్వహించాలని భావిస్తోందని చెప్పింది.

ఇందుకోసం  లాభాపేక్ష లేకుండా సంప్ర‌దాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందించనున్నట్లు టీటీడీ తెలిపింది. నిత్యాన్నదాన భవనంలో కూడా దాతల సహాయంతో ప్రస్తుతం అందుతున్న కూరగాయలతో పాటు,  మరిన్ని కూరగాయలు, దినుసులు తెప్పించి రోజుకోరకమైన కూరను వడ్డించేలా టీటీడీ చర్యలు చేపడుతోందని వివరించింది.

బయట ఆహారాన్ని తీసుకోవాలనే శ్రీవారి భక్తులకు లాభాపేక్ష లేకుండా రుచికరమైన సంప్రదాయ భోజనాన్ని  టీటీడీ యాజమాన్యమే అందజేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యమని స్పష్టం చేసింది.  అసలు నిజాలు ఇలా ఉంటే కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించింది.  శ్రీవారి భక్తులు, దాతలు ఇలాంటి అసత్య ప్రచారం విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా ధార్మిక సంస్థ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో వండిన సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ భోజనాన్ని శుక్రవారంనాడు టీటీడీ ఈవో కె.ఎస్ జవహర్ రెడ్డి స్వీకరించారు. తిరుమల అన్నమయ్య భవనం క్యాంటీన్ లో టీటీడీ గురువారంనుంచి వారం రోజుల పాటు సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 

దాతల సహకారంతో తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా ంపడించిన పంటలతో వండే ఆహారం స్వీకరించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన చెప్పారు 

కరోనా సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇటువంటి ఆహారంపై చర్చిస్తున్నట్లు జవహర్ రెడ్డి తెలిపారు. పట్టణవాసులతో పోలిస్తే గ్రామాల్లో సహజసిద్ధంగా లభించే ఆహారం తీసుకునేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సందేశాన్ని ప్రజలకు అందించడం ద్వారా గో ఆదారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించి గోమాతను రక్షించుకునేందుకు అందిస్తామని చెప్పారు.

click me!