ఆరు నెలల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేత అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

By Sumanth KanukulaFirst Published Dec 31, 2022, 11:26 AM IST
Highlights

శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని నిలిపివేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచరాం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై తిరుమల తిరుపతి దైవస్థానం క్లారిటీ ఇచ్చింది. 

తిరుమల శ్రీవారి దర్శనం ఆరు నెలల పాటు నిలిపివేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దైవస్థానం క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని నిలిపివేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచరాం జరుగుతుంది. అయితే ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఆ ప్రచారం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు వాస్తవ వివరాలను తెలియజేశారు. 

ఆనంద నిలయం బంగారుతాపడం పనులు ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.  బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023 మార్చి 1వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారన్నారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహించనున్నట్టుగా చెప్పారు.  ఇందులోభాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారని వివరించారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారని చెప్పారు. 

మూలమూర్తికి, దారు విగ్రహానికి అన్ని ఆర్జిత సేవలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఆరు నెలల సమయంలో భక్తులు మూలమూర్తిని, బాలాలయంలోని దారు విగ్రహాన్ని భక్తులు దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. తిరుమలలో నేడు, రేపు టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. రేపటి నుంచి జనవరి 2 వరకూ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీని సైతం నిలిపివేయనుంది. రేపటి నుంచి జనవరి 3 వరకూ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది.
 

click me!