
వేసవి సెలవులు మొదలవ్వడంతో తెలుగు రాష్ట్రాల స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో చాలామంది కుటుంబాలతో కలిసి తిరుమలకి వెళ్తున్నారు. ఎండలు మండుతున్నా, శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దాంతో తిరుమల కొండ ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ముందస్తు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నేరుగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. కంపార్ట్‌మెంట్లలో గడిపే సమయం లేకుండా, భక్తులు నేరుగా స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అంతే కాదు, బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో సాధారణ భక్తులకు మరింత వేగంగా దర్శనం జరుగుతోంది. ఇది భక్తులకు చాలా ఊరటగా మారింది. ఇటీవల ఆదివారం ఒక్క రోజే 83,380 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 27,936 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇక మంగళవారం నుంచి మూడు రోజులపాటు శ్రీవారి పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఏ రోజు చూసినా, శ్రీవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఏకంగా ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులు సర్వదర్శనం కోసం దాదాపు ఆరు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిన్న ఒక్కరోజే దాదాపు 65 వేల మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా 26 వేల దాటింది. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఎక్కువగానే నమోదైంది. మొత్తం రూ.3.78 కోట్ల వరకు భక్తులు హుండీలో విరాళాలు సమర్పించారు.
ఈ రీతిగా భక్తుల సందర్శన పెరుగుతోన్న నేపథ్యంలో, టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నట్లు తెలిపారు. దర్శనానికి వచ్చేవారికి ముందుగానే ఆన్‌లైన్‌లో టోకెన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలసత్వం వహిస్తే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.