
Tirupati Sri City: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలంలో (SEZ) దక్షిణ భారతదేశంలో తన తొలి తయారీ ప్లాంట్‌ను LG ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయనుంది. రూ.5,001 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మాణానికి మే 8న భూమి పూజ జరగనుంది. ప్రస్తుతం LGకి పుణే, నోయిడాల్లో ప్లాంట్లు ఉండగా, ఇప్పుడు ఏర్పాటు కాబోయేది భారతదేశంలో మూడో ప్లాంట్‌గా నిలవనుంది.
శ్రీ సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి TNIEకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కలిసి ఈ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి కృషి చేశారని తెలిపారు. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని అన్నారు.
శ్రీ సిటీలో ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 235కి పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు కలిపి సుమారు $4.5 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి ద్వారా 65,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించారు. వీరిలో 52 శాతం మంది మహిళలే కావడం విశేషం.
తిరుపతి శ్రీ సిటీలోని ప్రముఖ పరిశ్రమలు ఇవే
జపాన్‌కు చెందిన 30కి పైగా కంపెనీలతో శ్రీ సిటీ, దేశంలో రెండవ అతిపెద్ద జపాన్ పెట్టుబడి కేంద్రంగా ఎదిగింది. ఈ వృద్ధి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమ విజయాన్ని ప్రతిబింబిస్తోంది. శ్రీసిటీ తయారీ రంగంలో భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలిపే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.