తిరుమలలో హెలికాఫ్టర్ల చక్కర్లు.. మేం జోక్యం చేసుకోలేం, ఎందుకంటే : వైవీ సుబ్బారెడ్డి

By Siva KodatiFirst Published Apr 27, 2023, 3:47 PM IST
Highlights

తిరుమల కొండలపై హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టిన వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆలయం మీదుగా చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు ఆర్మీకి చెందినవిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమల కొండలపై హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నో ఫ్లైయింగ్ జోన్ అయిన శేషాచలం కొండలపై హెలికాఫ్టర్లు ఎలా ఎగురుతాయంటూ భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గురువారం తిరుపతిలోని వినాయక్ నగర్ టీటీడీ క్వార్టర్స్‌లో ఉద్యోగుల కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆలయం మీదుగా చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు ఆర్మీకి చెందినవిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

టీటీడీ ఉద్యోగుల కల అయిన ఇంటి స్థలాల సమస్యను తాము సాకారం చేశామని.. సీఎం జగన్ ఆదేశాలతో 300 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. భూమిని చదును చేసి ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందించే ప్రక్రియ జరుగుతోందని సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలిగించేలా సులభ్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగడం సరికాదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సమ్మె నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 

ALso Read: తిరుమల కొండలపై హెలికాప్టర్ల చక్కర్లు.. తీవ్ర కలకలం..

కాగా.. మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి . అయితే శేషాచలం ప్రాంతం నో ఫ్లెయింగ్ జోన్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. వీటిపై ఆరా తీయగా.. ఆ మూడు హెలికాఫ్టర్లు భారత వాయుసేనకు చెందినవిగా తేలింది. 

click me!