
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. తాను విమర్శలకు భయపడేవాడిని కాదని చెప్పారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నానని తెలిపారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినని అన్నారు. దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానన్నారు. ఆ ఆలోచన తనదేనని చెప్పారు. కొండమీదకు నడిచివెళ్లిన వారికి దివ్యదర్శనం కల్పించాలని టోకెన్ సిస్టమ్ ప్రారంభించింది తానేనని చెప్పారు
తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది తానేనని చెప్పారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసింది తానేనని తెలిపారు. దళితవాడలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది కూడా తానేనని అన్నారు. తనపై నాస్తికుడని, క్రిస్టియన్ అని ముద్ర వేస్తున్నారని.. అలాంటి వారికి ఇదే తన సమాధానమని చెప్పారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదని తెలిపారు. తాను పోరాటాల నుంచి పైకి వచ్చానని.. ఇలాంటి వాటికి భయపడనని తెలిపారు.