జగన్ ప్రజా సంకల్పయాత్రకు ఎనలేని ఆదరణ

By Nagaraju TFirst Published Dec 17, 2018, 4:58 PM IST
Highlights

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆ పార్టీలో జోష్ నింపుతోంది.  
 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆ పార్టీలో జోష్ నింపుతోంది.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది కాలంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా వరకు అప్రతిహాతంగా సాగుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు జగన్ 323 రోజులు పాదయాత్ర చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టారు. అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే సంకల్పంతో వైఎస్ జగన్ కూడా ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. 

అయితే వైఎస్ జగన్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నిరాజనం పలుకుతున్నారు. పాదయాత్రతో వెళ్లి ముఖ్యమంత్రిగా రావాలంటూ మహిళలు, అభిమానులు హారతులు పడుతున్నారు. 

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను విపరీతంగా ప్రచారం చేస్తూ జగన్ తన పాదయాత్రను ప్రచారం చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. 

వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టక ముందు ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ పాదయాత్ర చేపట్టేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మందికి పైగా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో ఆ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

జగన్ పాదయాత్ర చేపట్టిన తర్వాత, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి వలసల సంఖ్య తగ్గుతూ వచ్చింది. జగన్ పాదయాత్ర చేపట్టిన తర్వాత కూడా 5 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అలాగే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.    

మంచి చేసే సంక‌ల్పం ఎవ‌రిదైనా ఎప్పుడైనా అది ఉత్తేజ త‌రంగ‌మ‌వుతుంది, ప‌ది మందినీ ప్ర‌భావితం చేస్తుంది అన్నచందంగా జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. దీంతో వలసలకు బ్రేక్ లు పడ్డాయి. 

మేలు చేయాల‌న్న‌ ఆలోచ‌న వెలుగు జాడ‌వుతుంది, ఆ మార్గం ఎంద‌రికో అనుస‌ర‌ణీయ‌మ‌వుతుంది అన్నట్లు జగన్ పాదయాత్రను చూసి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల కోసం పరితపిస్తున్న నేతగా ప్రజలు జగన్ ను కొనియాడుతూ ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నారు.  

ఒకప్పుడు పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వలసలు వెళ్లిపోతే పాదయాత్ర పుణ్యమా అంటూ రివర్స్ అయ్యాయి. అనేక మంది నేతలు వైసీపీ గూటికి చేరారు. జగన్ అన్నబాటలో పయనిస్తామంటూ ప్రతిన బూనిన నేతలు ఎందరో ఉన్నారు. 

ఒక్క రాజకీయ రంగంలోనే కాదు సినీరంగంలోని ప్రముఖులు కూడా సంక‌ల్ప‌యాత్రికుడు జగన్ కు మద్దతుగా నిలిచారు. జగన్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు.  ప్రజాసంకల్పయాత్ర ఎందరికో జీవితాన్నిచ్చే వెలుగుల తోర‌ణంగా మారబోతుందంటూ ప్రశంసలు కురిపించారు. 

ఓ దీపం మ‌రిన్ని జ్యోతుల‌ను వెలిగిస్తుందన్నట్లు ఒక్కడుగా జగన్ చేపట్టిన పాదయాత్రలో ఎందరో అడుగులువేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల పథకాలను ప్రకటించింది. నవరత్నాలే తమ పార్టీ మేనిఫెస్టోగా ప్రచారం చేసుకుంటూ జగన్ దూసుకుపోతున్నారు. 

వైఎస్ జగన్ నవరత్నాల గురించి చెప్తున్న తీరు అందర్నీ ఆలోచింపజేస్తోంది. వివిధ సామాజిక వర్గాల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలు తెగ సంబర పడిపోతున్నారు. 

పాదయాత్రకు ముందుతో పోల్చుకుంటే పాదయాత్ర మొదలైన తర్వాతే జనాల్లో జగన్ కు విపరీతమైన క్రేజు వచ్చిందని స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. అందుకు నిదర్శనమే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలే అందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబును అధికారంలో నుండి సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని వైసిపి నేతలు చెప్తున్నారు. 

ఇకపోతే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను అమలు చెయ్యడంలో విఫలమైందని జగన్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, కాపు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను టీడీపీ విస్మరించిందని అందుకు ఆధారాలను సైతం ప్రజల సమక్షంలోనే విరిస్తూ మార్కులు కొట్టేస్తున్నారు వైఎస్ జగన్. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయలేక చతికిలపడ్డ చంద్రబాబును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీల పెళ్లిల్లకు లక్ష రూపాయలు ఇస్తామంటూ జగన్ ప్రకటనకు దళితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇకపోతే అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు ఆరోగ్య శ్రీ పథకంలో సమూల మార్పులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు జగన్. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అలాగే ఆరోగ్యశ్రీలో ఖర్చుకు మినహాయింపు లేదంటూ వరాల జల్లు  కురిపించారు. 

అన్ని రాష్ట్రాలు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయా రాష్ట్రాల పరిధిలోనే అమలు చేస్తుంటే జగన్ మాత్రం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్నా అమలు చేస్తామంటూ ప్రకటించడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది.  

అంతేకాదు వివిధ ప్రభుత్వాలు కొన్ని రకాల వ్యాధులు అంటూ పరిమితులు పెట్టిన నేపథ్యంలో దాన్ని అధిగమించి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నీ రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతుంది. 

అంతేకాదు ఆపరేషన్ లేదా రోగికి చికిత్స అనంతరం కూడా బత్రికేందుకు అండగా ఆర్థిక సహాయం ప్రకటించడం పేదలను వైసీపీకి మరింత దగ్గర చేస్తోంది. ఇకపోతే కిడ్నీ వ్యాధి, తలసేమియాతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధడుతున్న వారికి నెలకు రూ.10వేలు పింఛన్ ఇస్తానంటూ ప్రకటించడంతో వైసీపీకి ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. 

ఇవేకాదు విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన వంటి పథకాలకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాంచి ఖుషీగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏడాది కాలంగా పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తిగా జగన్ మరో రికార్డు సైతం తిరగరాయడం ఆపార్టీకి మరింత జోష్ గా చెప్పుకోవచ్చు. 

click me!