ఏపీలో చుక్కలనంటుతున్న టమాటా ధరలు.. దిగుబడి తగ్గడం వల్లే ఈ పరిస్థితి..

By SumaBala BukkaFirst Published May 21, 2022, 11:22 AM IST
Highlights

అకాల వర్షాలు, ఆసనీ తుపాను, ఎండవేడి.. రకరకరాల కారణాలతో ఏపీలో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. 

విజయవాడ : ఆంద్రప్రదేశ్‌లో టమాట ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో మార్కెట్‌ లెక్కల ప్రకారం కిలోరగ రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. టమోటా ధరల పెరుగుదలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

టమాటా కొరత కారణంగానే ధర పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ తెలిపారు. దీంతో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి టమోటాలను దిగుమతి చేసుకుంటోంది. మే 20 నుండి అన్ని రైతు బజార్లలో టమాటా సరసమైన ధరలకే విక్రయించబడుతుంది. రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ లో టమాట దిగుబడి తగ్గిన నేపథ్యంలో ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు టమాట విక్రయిస్తున్నారని తెలిపారు.

విజయనగరం రైతుబజార్‌లో కిలో రూ.65, శ్రీకాకుళంలో రూ.60, విశాఖపట్నంలో రూ.64, రాజమండ్రిలో రూ.58, పశ్చిమగోదావరిలో రూ.60, కృష్ణాలో రూ.53, గుంటూరులో రూ.58కి టమోటా ధర పెరిగింది. ప్రకాశంలో రూ.75, నెల్లూరులో రూ.68, చిత్తూరులో రూ.75, కడప, అనంతపురంలో రూ.65, కర్నూలులో రూ.78, బహిరంగ మార్కెట్లలో కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది.

కాగా, వేసవి కాలంలో టమాటా పంట సరిగ్గా పండలేదు... పండిన కాస్తో కూస్తో పంట ఇటీవల వచ్చిన ఆసనీ తుపాను కారణంగా దెబ్బతిన్నది. దీంతో కారణమేదైతేనేం టమాటా పంట దెబ్బతినడంతో మార్కెట్లో టామాటాకు గిరాకీ పెరిగిపోయింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న టమాటా ధర మే 19నాటికి ఏపీలో కిలో వంద రూపాయిలుగా వుంది. ఇక రైతు బజార్లలో కూడా కిలో టమాటా 70 రూపాయలు పలుకుతోంది. బహిరంగ మార్కెట్ లో 100 రూపాయలు దాటిపోయింది. 
టామాటా ధర ఇలా చుక్కలనంటడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే నిర్షయం తీసుకుంది జగన్ సర్కార్. ఈ నెల 20 నుండి రైతు బజార్లలో సరసమైన ధరలకు టమాటా విక్రయించనున్నట్లు మే 19న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి  కాకాని గోవర్ణన్ రెడ్డి ప్రకటించారు. 

ఆయన మాట్లాడుతూ.. టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే టమాటాలను విక్రయించేందుకు ప్రబుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపత్యంలో రైతు బజార్లలో ప్రభుత్వమే టమాటాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నాం'' అని మంత్రి కాకాని తెలిపారు. 

''బహిరంగ మార్కెట్లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను కొనుగోలు చేయనుంది. ఇలా కొన్న టమాటాలను రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ద్వారా  సరసమైన ధరలకే విక్రయించేందుకు చర్యలను తీసుకుంటున్నాం. ఇందుకోసం చర్యలు చేపట్టాలని ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైతు బజార్ల సి.ఇ.ఓ కు కూడా ఆదేశాలు జారీచేయడం జరిగింది'' అని మంత్రి తెలిపారు. 

click me!