
టమాటో (tomato) ధర మళ్లీ కొండెక్కింది. రికార్డ్ స్థాయిలో ఏకంగా 80 రూపాయలు వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ ప్రైస్ అంటున్నారు వ్యాపారులు. దిగుబడి తగ్గడం.. ఇతర రాష్ట్రాల్లో టమాటో పంట లేకపోవడంతో అత్యధిక ధర పలుకుతోంది. మదనపల్లి (madanapalle) మార్కెట్‌కు ప్రస్తుతం 150 మెట్రిక్ టన్నుల టమాటో దిగుమతి అవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది.
బుధ, గురువారాల వరకు కిలో రూ.30 నుంచి రూ.45 వరకు పలికిన టమోటాలు.. శనివారం ఏకంగా రూ. 75కు చేరాయి. మదనపల్లె మార్కెట్‌లో 30 కిలోల బాక్సు ధర రూ. 2 వేలు పలికింది. గుర్రంకొండలోనూ (gurram konda) రూ. 1,800 నుంచి రూ. 2 వేల వరకు అమ్ముడుపోయాయి. కలకడలో (kalakada) 15 కిలోల బాక్సు రూ.800 నుంచి రూ. వెయ్యికి పైగా పలికినట్లుగా తెలుస్తోంది.
Also Read:టమాటా కిలో రూ. 2... భారీగా పడిపోయిన ధరలు..!!
చిత్తూరు జిల్లా (chittoor district) మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా 74 రూపాయల వరకు పలుకుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దగా టమాటా దిగుబడులు లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. బయట మార్కెట్లలో పెద్దగా టమాటా కన్పించకపోవడంతో అంతా మదనపల్లి మార్కెట్‌కే పంటను తరలిస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి టమాటా.. మదనపల్లి మార్కెట్‌కు వస్తోంది. అన్‌సీజన్‌లోనూ టమాటాకు మంచి ధర పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం ఎప్పటిలానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు. ఇటు కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన సామాన్యులకు ఈ ధరలు మరింత షాకిచ్చాయి.