ఇప్పటికే టిడిపి ఆరు అంశాలతో మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనసేన ప్రతిపాదించే అంశాలను కూడా చేర్చి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సిద్దమయ్యారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై టిడిపి, జనసేన కూటమి దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇరుపార్టీలు కలిసే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించాయి... ఈ నేపథ్యంలో ఇకపై ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇరుపార్టీలను సమన్వయం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజలకు ఇచ్చే హామీల రూపకల్పనకు ఇటీవల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటుచేసారు. ఇవాళ(సోమవారం) ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యులు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు.
టిడిపి నుండి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభిరాంలు, జనసేన నుండి నాదెండ్ల మనోహర్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ లతో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటయ్యింది. ఇవాళ మద్యాహ్నం 3గంటలకు ఈ కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆరు అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. జనసేన ప్రతిపాదించే మరో నాలుగైదు అంశాలను కూడా ఇందులో చేర్చి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ఇలా ఇరుపార్టీలు రాష్ట్రంలోని ప్రజలందరినీ కదిలించేలా మేనిఫెస్టోను రూపొందించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించాయి.
మహిళలు, రైతులు, యువత, బిసి, పేదల కోసం ఏం చేస్తామన్నది టిడిపి మినీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇప్పుడు జనసేన భవననిర్మాణ కార్మికులు, ఎస్సి ఎస్టీలు, యువత, రైతులకు సంబంధించిన మరో నాలుగైదు ప్రతిపాదనలను టిడిపి ముందుంచింది. ఈ అంశాలపై ఇవాళ్టి ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీలో ఇరుపార్టీల సభ్యులు చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.
Read More టిడిపి నాయకులకు హైదరాబాద్ అంత సేఫ్ కాదా... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు టిడిపి, జనసేన కూటమిపై మరింత నమ్మకం పెరిగేలా చేయాలని భావిస్తున్నారు. అందుకోసమే కమిటీని ఏర్పాటుచేసి ఏయే అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలన్నదానిపై కూలంకశంగా చర్చించేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి ఇరుపార్టీల నాయకులంతా ప్రజల్లోనే వుండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలావుంటే టిడిపి, జనసేన నాయకులతో ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ ఇటీవల విజయవాడలో సమావేశమయ్యింది. ఈ సమావేశంలోనే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఇరుపార్టీల నాయకులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే టిడిపి, జనసేన పార్టీల్లోని సీనియర్ నాయకులు ముగ్గురు చొప్పున ఆరుగురితో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని కూడా ప్రకటించారు.
ఇక ఇప్పటికే జిల్లా స్థాయిలో ఆత్మీయ సమావేశాలను నిర్వహించిన టిడిపి, జనసేన కూటమి ఇక నియోజకవర్గ స్థాయిలో వీటిని చేపట్టాలని నిర్ణయించింది. దీనిపైనా ఇటీవల జరిగిన జేఏసి సమావేశంలో చర్చించారు. దీపావళి తర్వాత అంటూ నేటినుండి మూడు రోజులపాటు 175 నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు జరపాలని నిర్ణయించారు.