మాచరలో పిచ్చికుక్క దాడికి గురయిన వారిని మున్సిపల్ కమీషనర్ పరామర్శించారు. పట్టణంలో కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపతామని ఆయన తెలిపారు.
మాచర్ల : దీపావళి పండగవేళ పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. దీపావళి సంబరాలు జరుపుకుంటున్న చిన్నారులతో పాటు పెద్దలపై దాడిచేసింది. ఇలా ఒకేరోజు ఏకంగా 17 మందిపై పిచ్చికుక్క దాడిచేసింది... వీరిలో 14 మంది చిన్నారులే వున్నారు. పిచ్చికుక్క తిరుగుతుండగంతో పండగపూట కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు మాచర్ల ప్రజలు భయపడిపోయారు.
పిచ్చికుక్క దాడికి గురయినవారిని కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు కుక్కకాటుకు గురయిన వారికి వైద్యం అందించడంతో ప్రమాదం తప్పింది. అయితే కుక్కకాటుకు గురయిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇలా చిన్నారులతో పాటు పెద్దలను కరుస్తూ భయపెడుతున్న పిచ్చికుక్కను స్థానికులు కొట్టిచంపారు.
చాలారోజులుగా కుక్కల బెడద ఎక్కువయ్యిందని ఫిర్యాదుచేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదని మాచర్ల ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్పుడే చర్యలు తీసుకుని వుంటే ఇప్పుడిలా ఇంతమంది హాస్పిటల్ పాలయ్యేవారుకాదని అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కుక్కల దాడుల నుండి పట్టణవాసులను కాపాడే చర్యలు చేపట్టాలని మాచర్లవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా పిచ్చికుక్క దాడిగురించి తెలిసిని వెంటనే మాచర్ల మున్సిపల్ కమిషనర్ ఇవి రమణ బాబు బాధితులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మెడిసిన్స్ ఏమైనా అవసరం వుంటే తనకు తెలియజేయాలని... ఉన్నతాధికారులతో మాట్లాడి తెప్పించే ఏర్పాట్లు చేస్తానని మున్సిపల్ కమీషనర్ తెలిపారు.
కుక్కల నివారణకు వెంటనే చర్యలు తీసుకుంటామని... వెంటనే కుక్కలను పెంచుకునే వారిని నోటీసులు ఇచ్చామని తెలిపారు. పెంపుడు కుక్కలను బయటకు తీసుకురావద్దని... ఇంట్లోనే ఉంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. బయటకు తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని... అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని మాచర్ల మున్సిపల్ కమీషనర్ హెచ్చరించారు.
ఇక వీధికుక్కల నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమీషనర్ తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్త పడతామని రమణ బాబు వెల్లడించారు.