ఇవాళే డిల్లీ నుండి ఏపీకి లోకేష్... ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ..!

By Arun Kumar PFirst Published Oct 3, 2023, 11:17 AM IST
Highlights

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న నారా లోకేష్ విచారణకు హాజరయ్యేందుకు ఇవాళ డిల్లీ నుండి ఏపీకి రానున్నట్లు సమాచారం. 

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను కూడా జగన్ సర్కార్ అరెస్ట్ చేయించనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లోకేష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో ఇవాళ(మంగళవారం) లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. 

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా ఆనాటి మంత్రులు లోకేష్, నారాయణ అవినీతికి పాల్పడినట్లు సిఐడి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిఐడి అధికారులు లోకేష్, నారాయణలకు నోటీసులు అందించారు. అక్టోబర్ 4న విచారణకు హాజరు కావాల్సిందిగా మాజీ మంత్రులిద్దరికీ సీఐడి సూచించింది. ప్రస్తుతం లోకేష్ దేశ రాజధాని న్యూడిల్లీలో వున్నప్పటికీ అక్కడికి వెళ్లిమరీ నోటీసులు అందించారు సిఐడి అధికారులు.  

Latest Videos

సీఐడి విచారణకు సహకరించాలన్న కోర్టు ఆదేశాలతో నారా లోకేష్ ఏపీకి వచ్చేందుకు సిద్దమయ్యారు. రేపు(బుధవారం) విచారణకు హాజరుకావాల్సి వుండగా ఇవాళ రాత్రికే లోకేష్ విజయవాడకు చేరుకోనున్నట్లు టిడిపి వర్గాల నుండి సమాచారం అందుతోంది. తండ్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత డిల్లీకి వెళ్లిన లోకేష్ రెండు వారాలుగా అక్కడే వున్నారు. సిఐడి విచారణ వాయిదా కోరబోనని చెప్పిన లోకేష్ అందుకోసం ఏపీకి వస్తున్నారు. 

Read More   అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై సీఐడీ నోటీసులు: ఏపీ హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్

ఇదిలావుంటే అరెస్టుకు భయపడే నారా లోకేష్ డిల్లీకి పారిపోయాడని వైసిపి నాయకులు అంటున్నారు. టిడిపి మాత్రం తన తండ్రి అక్రమ అరెస్టును జాతీయ పార్టీలు, మీడియా దృష్టికి తీసుకువెళ్లేందుకే లోకేష్ డిల్లీలో వుంటున్నారని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో టిడిపి ఎంపీలతో కలిసి ఆందోళన చేపట్టడంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసారు లోకేష్. నిన్న గాంధీ జయంతి సందర్భంగా డిల్లీలోనే సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్ష కూడా చేపట్టాడు.ఇలా రెండు వారాలుగా దేశ రాజధాని డిల్లీలో వుంటున్న లోకేష్ ఇవాళ ఏపీకి చేరుకోనున్నారు. 

ఇక ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి నారాయణ ఏ2గా వున్నారు. ఆయనను కూడా లోకేష్ తో పాటే విచారించేందుకు సిఐడి సిద్దమయ్యింది.ఈ మేరకు అక్టోబర్ 4న ఉదయం తాడేపల్లి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నారాయణకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు అధికారులు.  

టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను మార్చారని వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
 
ఈ కేసులో నారా లోకేష్‌ను ఏ14గా పేర్కొంటూ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో సెప్టెంబర్‌ 26న ఏపీ  సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కొంత మందికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్‌ కుటుంబానికి లోకేష్ సాయం చేశారనే ఆరోపణలు  ఉన్నాయి. ఈ కేసులో లింగమనేని రమేష్‌ ఏ3గా ఉన్నారు.

click me!