
అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మరికొద్దిసేపట్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ పిడుగుల ప్రమాదం పొంచివుందని... ప్రజలు జాగ్రత్తగా వుండాలని సూచించారు. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో చెట్లకింద వుండరాదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.
వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇవాళ(ఆదివారం) కూడా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని ఐఎండి ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం వుంది కాబట్టి అప్రమత్తంగా వుండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఇక గతకొద్ది రోజులుగా తెలుగురాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎండల తీవ్రత కూడా పెరిగిపోయి వేడిగాలులు వీస్తున్నాయి. ఇలా రెండురకాల వాతావరణ పరిస్థితులను తెలుగు ప్రజలు చవిచూస్తున్నారు.
ఇదిలావుంటే రానున్న ఐదురోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత తక్కువగా వుండనుందని ఐఎండి వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాల్లో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడనుందని తెలిపింది.