
అమరావతి: అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోందని... దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 48గంటలపాటు కూడా andhra pradesh లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని ప్రకటించారు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని అనేక చోట్ల శుక్రవారం రాత్రి నుండి శనివారం రాత్రివరకు భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. తిరుపతిలో 106.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇదిలావుంటే దేశం నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చివరి దశకొచ్చిందని... రెండురోజుల్లో ఇవి పూర్తిగా నిష్క్రమించనున్నట్లు తెలిపారు. నైరుతి నిష్క్రమణ పూర్తయిన వెంటనే ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుందని తెలిపారు. మొదట ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి క్రమక్రమంగా దేశంమొత్తంలో వ్యాపించనున్నాయి.
read more ధర్మవరంలో మార్కెట్‌లో దుకాణాల తొలగింపు: వ్యాపారుల అరెస్ట్,ఉద్రిక్తత
ఇటీవల గులాబ్ తుఫాను ఏపీలో భీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసాయి. ముఖ్యంగా తుఫాను తీరందాటిన శ్రీకాకుళంలో జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసాయి.
భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహించాయి. జలాశయాలు, చెరువులు నిండుకుండను తలపించాయి. జనావాసాల్లోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలకు పంటలు తడిసి, వరద నీటిలో మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మళ్లీ వర్షాలు మొదలవడంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.