
అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండురోజులు ఎండల తీవ్రత అధికంగా వుండనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ మూడురోజుల్లో నమోదయ్యే అవకాశాలున్నాయని... ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వృద్దులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా వుండాలని... అవసరం వుంటే తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు.
ఇవాళ(ఆదివారం) సెలవురోజు కాబట్టి కుటుంబాలతో కలిసి బయటకు వెళ్లేవారు ఎండనుండి రక్షణ పొందే జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సూచించారు. నేడు రాష్ట్రంలోని 136 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయిని ప్రకటించారు. అలాగే రేపు(సోమవారం)153 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 132 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని విపత్తుల సంస్థ ప్రకటించింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతుండగా తాజాగా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎండల తీవ్రత అధికంగా వుండే జిల్లాలు, మండలాల అధికారులకు విపత్తుల సంస్థ పలు సూచనలు ఇచ్చింది.
Read More తెలంగాణలో మండుతున్న ఎండలు.. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్..!!
ఇవాళ విజయనగరం,మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే వుండనుందని విపత్తుల సంస్థ హెచ్చరించింది. ఇక శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాస్త తక్కువగా 42°C-44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకటించారు.
సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా వుండనుందని తెలిపారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాస్త ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.