తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో అన్యమత ప్రచారం

By narsimha lodeFirst Published Jan 2, 2020, 12:33 PM IST
Highlights

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలోని చెట్లపై అన్యమత ప్రచార గుర్తులు కలకలం రేపుతోంది. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో చెట్లకు శిలువ గుర్తులు వేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న స్విమ్స్‌లో శిలువ గుర్తులు వేయడం కలకలం రేపుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చెట్లకు శిలువ గుర్తులు గురువారం నాడు దర్శనమిచ్చాయి. బుధవారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకొన్నట్టుగా ఆసుపత్రి సిబ్బంది అనుమానిస్తున్నారు.

స్విమ్స్ ఆసుపత్రిలోని చెట్లపై శిలువ గుర్తులను గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శిలువ గుర్తులను చెరిపివేయాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఆసుపత్రి సిబ్బంది  వెంటనే శిలువ గుర్తులు ఉన్న మేరకు చెట్ల బెరడును తొలగించారు.

ఆసుపత్రిలో చికిత్స కోసం ఉండే రోగులు, ఆసుపత్రి సిబ్బంది మినహా ఎవరూ కూడ ఇటువైపు రారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే చెట్లపై ఎవరు శిలువ గుర్తును వేశారనే విషయమై ఆసుపత్రి ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

అత్యంత భద్రత ఉండే ఈ ప్రాంతంలో చెట్లపై శిలువ గుర్తు చర్చకు దారితీసింది. ఆసుపత్రి సెక్యూరిటీ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంస్థలు కోరుతున్నాయి.

click me!