పవన్ ను సీఎం చేసేందుకు... తిరుపతి ఉప ఎన్నిక వార్మప్ మ్యాచ్: నాదెండ్ల మనోహర్

By Arun Kumar PFirst Published Apr 12, 2021, 9:23 AM IST
Highlights

భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రత్నప్రభ ఎన్నికల బరిలో నిలబడ్డారని... ఆమెను గెలిపించడానికి మన వంతు కృషి మనం శక్తివంచన లేకుండా చేయాలని జనసేన నాయకులకు నాదెండ్ల సూచించారు. 

తిరుపతి: డాక్టర్ల సలహా మేరకు క్వారంటైన్లో ఉన్న కారణంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం జరిగే నాయుడుపేట సభలో పాల్గొనకపోవచ్చునని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన రాకపోవడంతో మనందరిపై మరింత బాధ్యత పెరిగిందని, సభను విజయవంతం చేసే విధంగా అందరం కలిసి కృషి చేద్దామని జనసైనికులు, నాయకులకు పిలుపునిచ్చారు. 

 ఆదివారం రాత్రి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన జనసేన నాయకులతో నాదెండ్ల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన అధ్యక్షులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారని తెలిపారు. అలాంటి నాయకుడు రేపు నాయుడుపేట సభకు వస్తున్నారని, ఆయనకు జనసేన పార్టీ తరపున ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు సూచించారు. 

''భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రత్నప్రభ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆమెను గెలిపించడానికి మన వంతు కృషి మనం శక్తివంచన లేకుండా చేయాలి. ప్రచారానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రతి ఒక్క జనసైనికుడు పార్లమెంటు పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి రత్నప్రభకి ఓటు పడేలా కృషి చేయాలి. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ నేతలు గత నాలుగు నెలలుగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో పని చేస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా మన పార్టీ ప్రతినిధులను పంపిద్దాం. నిస్వార్ధంగా పవన్ కళ్యాణ్  ఆశయాల కోసం పని చేసే వారిని గుర్తించి వారికి పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లుగా బాధ్యతలు అప్పగించండి'' అని నాదెండ్ల సూచించారు.

read more  రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ: సోము వీర్రాజు వ్యాఖ్యలు 

''ఈ రోజు మనం రెండు పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక వైపు దానిని ఎదుర్కొంటూనే ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నాం. అందరు కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బాధ్యత గల పౌరులుగా మెలగండి. అలాగే ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టు చేయించుకోండి. నిర్లక్ష్యం వహిస్తే మీ కుటుంబంతోపాటు మీ సహచరులు కూడా ఇబ్బందిపడే పరిస్థితి వస్తుంది'' అని హెచ్చరించారు.

''ప్రచారానికి ఇంకా ఐదు రోజులే మిగిలి ఉంది. రత్నప్రభ గెలుపు కోసం అందరం కష్టపడదాం. ఎల్లుండి ఉగాది పండగ రోజు కూడా ఏదో ఒక చోట ప్రచారం ఉండేలా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. అందులో కూడా అందరం పాల్గొని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్దాం. మన ద్వారా బీజేపీ అభ్యర్ధి గెలుపు నల్లేరుపై నడకలా సాగిపోయింది అనేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఇందుకోసం మన నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల ప్రక్రియను చాలా సీరియస్ గా తీసుకోవాలి. లోక్ సభకు ఉప ఎన్నికగా చూడొద్దు. తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ఇది వార్మప్ మ్యాచ్ గా పరిగణించి పని చేయాలి. ఎవరూ ఎక్కడా నిరాశపడొద్దు. ఇది ఎవరి కోసమో చేస్తున్న ఎలక్షన్ కాదు.. మన కోసం మనం చేసుకుంటున్న ఎలక్షన్ గా అందరు భావించి రత్నప్రభని గెలిపించేలా అందరు పని చేయాలి" అని నాదెండ్ల సూచించారు.   

click me!