సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. తిరుమలలో డ్రోన్ కెమెరాలకు అనుమతి లేదని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుమలలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ అనే ఖాతా నుంచి వీడియో అప్‌లోడ్ అయ్యింది. డ్రోన్లు ఎగురవేసినా టీటీడీ విజిలెన్స్ గుర్తించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లుగా తెలుస్తోంది.మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇది గూగుల్ లేదా త్రీడి ఇమేజ్ అయి వుంటుందన్నారు. ఇటీవల ఆలయం వెనుక వైపు ఏర్పాటు చేసిన క్రేన్ విజువల్స్ లేకపోవడంతో ఈ వీడియో ఇప్పటివి కావన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. తిరుమలలో డ్రోన్ కెమెరాలకు అనుమతి లేదని ధర్మారెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.