అంగట్లో సరుకుగా ఆడపిల్ల.. భారం అని తలచి పసికందును అమ్మేసిన తండ్రి.. రేట్లు పెంచి పలుమార్లు విక్రయించిన ఇతరులు

Published : Mar 29, 2022, 08:00 PM IST
అంగట్లో సరుకుగా ఆడపిల్ల.. భారం అని తలచి పసికందును అమ్మేసిన తండ్రి.. రేట్లు పెంచి పలుమార్లు విక్రయించిన ఇతరులు

సారాంశం

గుంటూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లను అంగట్లో సరుకుగా పలుమార్లు రేట్లు పెంచి క్రయ విక్రయాలు జరిపారు. తన తండ్రి రూ. 70 వేలకు అమ్మేయగా.. పలుమార్లు చేతులు మారి చివరకు తూర్పు గోదావరి ఏలూరుకు చెందిన వ్యక్తి రూ. 2.50 లక్షలు వెచ్చి ఆ చిన్నారిని కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో గుట్టురట్టు చేశారు.   

అమరావతి: ఆడపిల్ల అంగట్లో సరుకు అయింది. ఆడ పిల్ల కుటుంబానికి భారం అనే జాఢ్యం నుంచి సమాజం ఇంకా బయట పడట్లేదు. పురాతనం నుంచి కొనసాగిస్తున్న కొన్ని సామాజిక దురాచారాలు, కట్టుబాట్లతోనూ ఆడ పిల్లలు తల్లిదండ్రులకు భారంగా భావిస్తున్నారు. కాబట్టి, ఒకరు లేదా ఇద్దరికి మించి ఆడ పిల్లలు జన్మిస్తే ఎలాగైనా వారిని వదిలించుకోవాలి అనే ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నవారే కసాయిలుగా మారుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ కర్కశ తండ్రి ఆడ పిల్లలను వదిలించుకోవాలని ఏకంగా అమ్మకానికి పెట్టాడు. రూ. 70 వేలు తీసుకుని ఆమ్మేశాడు. ఈ నేరం అక్కడితో ముగియలేదు. తండ్రి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి ఆ పసికందును ఈ రేటు పెంచి మరొకరి అమ్మారు. ఇలా శిశువుపై ధరను కమిషన్‌గా పెంచుకుంటూ ఇతరులకు ఒక సరుకు వలే అమ్మారు. పలువురు పలుమార్లు ఆమెను కొనుగోలు చేసి కొన్న ధర కంటే ఎక్కువ రేటుకు ఇతరులకు అమ్మేశారు. రూ. 70 వేల నుంచి తండ్రి నుంచి అంగట్లోకి వెళ్లిన ఆ పసికందును తూర్పు గోదావరికి చెందిన ఓ వ్యక్తి రూ. 2.50 లక్షలు చెల్లించి తీసుకున్నాడరు. ఈ మధ్యలో ఆ పసికందు ఎందరి చేతుల్లోనే మారింది. ఈ అమానవీయ కేసు వివరాలను మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ జే రాంబాబు, పట్టణ సీఐ బి అంకమ్మ రావు, ఎస్ఐ ఈ
నారాయణలు వెల్లడించారు. 

మంగళగిరిలోని గండాలయపేటకు చెందిన మెడబలిమి మనోజ్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెల సంతానం ఉన్నది. ఇటీవలే ఆయన భార్య మరోసారి ప్రసవించింది. ఈ ప్రసవంలోనూ ఆమె మరో ఆడపిల్లకే జన్మ ఇచ్చింది. ఇది వరకు ఇద్దరు కుమార్తెలు ఉండటంతో మూడవ పాపను పోషించడం తనతో కాదని మనోజ్ దిగులుపడ్డాడు. ఆమెను ఎలాగైనా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం అదే ప్రాంతానికి చెందిన మిక్కిలి నాగలక్ష్మి అనే వివాహితకు తెలిసింది. ఆమె సహకారంతో నల్గొండ జిల్లా దామ్రచర్ల మండలం కొండప్రోలు గ్రామానికి చెందిన మేఘావత్ గాయత్రి అనే వివాహిత మనోజ్‌కు జన్మించిన మూడు నెలల పసికందును కొనుగోలు చేయడానికి సిద్ధం అయ్యారు. రూ. 70 వేల వెచ్చించి ఆ పసికందును కొన్నారు.

అనంతరం ఆ మేఘావత్ గాయత్రి ఆ పసికందును తన దగ్గరే ఉంచుకోని పెంచుకోలేదు. ఆ పసికందును మార్కెట్లో సరుకు తరహాలోనే ఎక్కువ ధరకు ఇతరులకు అమ్మాలని నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా లంబాడి దేవలతండా, పాల్కెడ్ గ్రమానికి చెందిన భూక్యా నందుఅనే మహిళకు రూ. 1.20 లక్షలకు విక్రయించింది. భూక్య నందు కూడా ఆ పసికందును పెంచుకోకుండా భూక్యా బలవర్తిరాజు అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన ఎస్‌కే నూర్జహాన్‌కు రూ. 1.87 లక్షలకు అమ్మేశారు. ఆ నూర్జహాన్ తాను కొనుగోలు చేసిన చిన్నారిని ఖమ్మం జిల్లాకు చెందిన అనుభోజు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి సహాయంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి నారాయణగూడకు చెందిన బొమ్మాడ ఉమాదేవికి రూ. 1.90 లక్షలకు విక్రయించింది

కాగా, బొమ్మాడ ఉమాదేవి తాను కొనుగోలు చేసిన ఆ చిన్నారిని విజయవాడ బెంజ్ సర్కిల్‌కు చెందిన పడాల శ్రావణికి రూ. 2 లక్షలకు అమ్మేసింది. పడాల శ్రావణి తాను కొనుగోలు చేసిన చిన్నారిని విజయవాడ గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మికి రూ. 2,20,000కు విక్రయించింది. ఆమె కూడా అంతటితో ఊరుకోకుండా ఆ పసికందును తూర్పు గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వర్రె రమేష్ అనే వ్యక్తికి రూ. 2.50 లక్షలకు అమ్మింది. 

గుట్టుగా సాగుతున్న ఈ చిన్నారి విక్రయ వ్యవహారం పోలీసులకు తెలివచ్చింది. దీంతో గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఉత్తర్వుల మేరకు డీఎస్పీ జే రాంబాబు సారథ్యంలో మంగళగిరి టౌన్ సీఐ బీ అంకమ్మరావు పర్యవేక్షణలో ఎస్ఐ నారాయణ తన సిబ్బంది సహాయంతో కేసును చేజ్ చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి మూడు నెలల పసికందును సురక్షితంగా కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు ఛేజ్ చేయడంలో ప్రతిభ చూపించిన సిబ్బందికి ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ రివార్డులు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం