కాకినాడలో లారీ బీభత్సం... గుడిలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం

By Arun Kumar PFirst Published Jun 4, 2023, 12:26 PM IST
Highlights

కాకినాడ జిల్లాలో గ్రావెల్స్ లారీ బీభత్సానికి ముగ్గురు బలవడంతో పాటు వినాయకుడి ఆలయం ధ్వంసమయ్యింది. 

కాకినాడ : టిప్పర్ లారీ అదుతుతప్పి గుడిలోకి దూసుకెళ్లి ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కాకికాడ జిల్లాలో చోటుచేసుకుంది. లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు గుడిలో నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా ఆలయం పూర్తిగా ధ్వంసమయ్యింది. 

ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన చుక్క శేఖర్ లారీ డ్రైవర్. ఆదివారం ఉదయం గ్రావెల్ లోడ్ లారీని అన్నవరం నుండి ఒంటిమామిడి వైపు తీసుకుని వెళుతుండగా ప్రమాదం జరిగింది. తన గ్రామానికే చెందిన క్లీనర్ కోనూరు నాగేంద్ర(23) తో కలిసి వెళుతుండగా ఎ.కొత్తపల్లి వద్ద ఒక్కసారిగా లారీ అదుపుతప్పింది.రోడ్డుపక్కనే వున్న తాగునీటి ట్యాంక్ ను ఢీకొట్టిన లారీ అంతటితో ఆగకుండా వినాయకుడి గుడిలోకి దూసుకెళ్లింది. దీంతో శేఖర్, నాగేంద్రతో పాటు గుడిలో నిద్రిస్తున్న సోము లక్ష్మణరావు(48) మృతిచెందారు. 

Read More  పల్నాడులో ఘోరం ... 50 మందితో వెళుతున్న ట్రావెల్స్ బస్సు-లారీ ఢీ

ఈ ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

లారీ డ్రైవర్ నిద్రమత్తులో నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తెల్లవారుజామును లారీ సృష్టించిన బీభత్సంలో మంచినీటి ట్యాంక్, వినాయక ఆలయం ధ్వంసమయ్యాయి. లారీ కూడా బాగా దెబ్బతింది. 
 

click me!