గుడిలో నిద్రిస్తున్న వారి పీకలు కోసి.. వారి రక్తంతో శివలింగానికి అభిషేకం

By Siva KodatiFirst Published Jul 16, 2019, 1:07 PM IST
Highlights

కొందరి అత్యాశ మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా అనంతపురం జిల్లాలో గుప్తనిధుల కోసం ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గుప్త నిధులు దొరికితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావొచ్చనే ఆశ ఇప్పటికే చాలా మందికి ఉంది. కాని కొందరి అత్యాశ మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా అనంతపురం జిల్లాలో గుప్తనిధుల కోసం ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కదిరికి సమీపంలోని తనకల్లు మండలం కార్తికోటకు చెందిన కమలమ్మ గ్రామ సమీపంలోని శివాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు తన తమ్ముడు శివారామిరెడ్డి, చెల్లెల్లు సత్యలక్ష్మీ సాయాన్ని కోరారు. వీరంతా కలిసి ఆలయ బాగోగులు చూసుకునేవారు.

కమలమ్మ ఆలయం వద్దే ఉంటుండగా.. తమ్ముడు, చెల్లెలు అప్పుడప్పుడు వచ్చే వారు. ఈ క్రమంలో సోమవారం పూజలు చేయాలని ఆదివారం రాత్రి ముగ్గురు ఆలయానికి చేరుకుని అక్కడే నిద్రించారు.

తెల్లవారుజామున దేవాలయానికి చేరుకున్న దుండగులు ముగ్గురిని కత్తితో గొంతు కోసి, ఛాతీపైనే గాట్లు పెట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు. అక్కడితో ఆగకుండా వీరి రక్తంతో ఆలయంలోని శివలింగాన్ని.. ఎదురుగా ఉన్న పుట్టుకు అభిషేకం చేశారు.

అనంతరం అక్కడి తొట్టెలో మునిగి వెళ్లిపోయారు. శివరామిరెడ్డి చాలా మంచి వ్యక్తని ... ఇతనిని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని కుటుంబసభ్యులు, గ్రామస్తులు చెబుతున్నారు.

కాగా.. ఐదేళ్ల కిందట ఇదే ఆలయంలో శివలింగాన్ని పెకలించేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా.. శివరామిరెడ్డి వారిని అడ్డుకోవడంతో దాడికి యత్నించారని ఆయన భార్య తెలిపారు. ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ పరిశీలించారు.

ఆలయంలో హత్యలు జరిగిన తీరును బట్టి గుప్తనిధులు తవ్వేవారే చేసే వారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని.. అయితే వ్యక్తిగత, రాజకీయ కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. 

click me!