మూడు రాజధానులు: చంద్రబాబును కార్నర్ చేస్తున్న బిజెపి నేతలు

By telugu teamFirst Published Jul 31, 2020, 7:52 PM IST
Highlights

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబును జీవీఎల్, తదితర బిజెపి నేతలు కార్నర్ చేస్తున్నారు.

అమరావతి: బిజెపికి తిరిగి దగ్గర కావాలనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలకు పూర్తి స్థాయిలో బ్రేకులు పడినట్లే కనిపిస్తోంది. సోము వీర్రాజు బిజెపి అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు అనూహ్యంగా చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబుకు దగ్గరవుతున్నట్లు కనిపించిన బిజెపి ఇప్పుడు పూర్తిగా ఆయనను తిరస్కరించే వ్యూహానికి పదును పెట్టింది.

అమరావతిపై పోరాటంలో అప్పటి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ కలిసి నడవడానికి సిద్ధపడ్డారు. అయితే, బిజెపి పెద్దలు ఎవరు కూడా ఆయనను వ్యతిరేకించినట్లు కనిపించలేదు. దీంతో చంద్రబాబుకు బిజెపి దగ్గరవుతోందనే సంకేతాలు వెళ్లాయి. కానీ గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత బిజెపి వైఖరి స్పష్టంగా వెల్లడైంది. 

Also Read: మూడు రాజధానులకు పచ్చజెండా: బిజెపి క్లియర్, చంద్రబాబుకు ఎసరు

చంద్రబాబును కార్నర్ చేస్తూ బిజెపి నేతలు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ నిర్ణయంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆ మాటలు ఆయన చంద్రబాబును ఉద్దేశించే అన్నారనేది స్పష్టం. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలనేది తమ వైఖరి అని ఆయన చెప్పారు. దీన్నిబట్టి సోము వీర్రాజు పూర్తిగా చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారని అర్థమవుతోంది.

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ప్రకటన మరింత స్పష్టంగా ఉంది. రాజధాని ఎంపికలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదని తాము పార్లమెంటులోనే చెప్పామని ఆయన అన్నారు. రాజ్యాంగానికి లోబడే గవర్నర్ నిర్ణయం ఉందని ఆయన అన్నారు. రాయలసీమలో హైకోర్టు పెడుతామని తాము ఎన్నికల ప్రణాళికలో చెప్పామని ఆయన గుర్తు చేశారు. అంటే జగన్ నిర్ణయం తమ వైఖరికి అనుకూలంగా ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. 

Also Read: మడమ తిప్పారు... ఇలా బిల్లులను ఆమోదించుకుంటారా: జగన్‌పై బాబు విసుర్లు

స్వార్థ రాజకీయాల కోసం అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుందని, చంద్రబాబు అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారని, రాజ్యాంగం తనకు అనుకూలంగా పనిచేయాలని చేయాలనుకోవడం చంద్రబాబుకు సరైంది కాదని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. 

కాగా, టీడీపీ నుంచి బిజేపిలో చేరిన ఎంపీ టీజీ వెంకటేష్... రాయలసీమలో న్యాయరాజధానిని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. అయితే, రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని, శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు రాయలసీమలో నిర్వహించాలని ఆయన కోరారు. మొత్తం మీద చంద్రబాబును గురిపెడుతూ బిజెపి నేతలు పెద్ద యెత్తున వ్యాఖ్యలు చేశారు. ఇది బిజెపి రాబోయే కాలంలో ఏపీలో అనుసరించబోయే వైఖరిని తెలియజేస్తోందని అంటున్నారు. 

click me!