
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్రాంచ్‌లో గురువారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఓ బ్యాంకు ఉద్యోగిని కత్తితో బెదిరించి సుమారు రూ.80 లక్షల విలువైన బంగారం, రూ.5 లక్షల నగదుతో ఉడాయించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసు దర్యాప్తులో పురోగతి లభించింది. బ్యాంకులో చోరీకి పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలోన్నర బంగారం, లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
అసలేం జరిగింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో కత్తులతో ముసుగులు ధరించిన దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారు. పెండింగ్‌లో ఉన్న ఖాతాలను మూసివేయడానికి సంబంధించి అదనపు పనులు ఉండడంతో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ఆ సమయంలో బ్యాంకులో పనిచేస్తున్నారు. ఇంగ్లీషులో మాట్లాడిన దొంగలు.. లాకర్ గదిని తెరవమని బ్యాంకు క్లర్క్‌ను బెదిరించారని ఒక బ్యాంకు ఉద్యోగి చెప్పారు. అనంతరం దొంగలు చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయారు.
“నేను మరియు మరొక ఉద్యోగి పెండింగ్‌లో ఉన్న ఖాతాలను మూసివేయడానికి అదనపు పని చేస్తున్నాము. రాత్రి 10.40 గంటల సమయంలో నా సహోద్యోగి పైకి వెళ్లారు. నేను బ్యాంకులో ఒంటరిగా ఉన్నాను. ముగ్గురు ముసుగు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి లాకర్ తెరవాలని బెదిరించారు. నేను అందుకు నిరాకరించడంతో, నన్ను కట్టేసి, నా చున్నీతో నోరును మూసేశారు. లాకర్ రూమ్ తాళాలు లాక్కున్నారు. అనంతరం లాకర్లలోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు’’ అని చోరీ జరిగిన సమయంలో బ్యాంకులో ఉన్న క్లర్క్ స్రవంతి తెలిపారు.
ఈ చోరీకి సంబంధించి సమాచారం అందుకున్న డీఎస్పీ విశ్వనాథ్, పోలీసు సిబ్బంది బ్యాంకుకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా, అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల్లోని ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఉన్న చెక్‌పోస్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తి, తిరుపతిలోని అన్ని లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.