
శంకర్నాయక్ వ్యవహారంతో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహార శైలిపై స్పష్టమైన తేడా కనబడుతోంది. తెలంగాణాలో మహబూబాబాద్ నియోజకవర్గం ఎంఎల్ఏ శంకర్ నాయక్-జిల్లా కలెక్టర్ ప్రీతీమీనా వివాదం ఇపుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయంశమైంది. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కలెక్టర్ ను ఎంఎల్ఏ చేయి పట్టుకున్నాడన్నది వివాదం. సరే కలెక్టర్ ఫిర్యాదుతో ఎంఎంల్ఏపై కేసు నమోదు చేసారు. అరెస్టూ జరిగింది, బెయిలూ వచ్చిందనుకోండి. ఇంతలో ఐఏఎస్ అధికారుల సంఘం కూడా అత్యవసర సమావేశం జరిపి ఎంఎల్ఏ తీరును ఖండించేసింది.
ఈ నేపధ్యంలోనే కెసిఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఎంఎల్ఏ శంకర్ పై మండిపడ్దారు. కలెక్టర్ కు ఎంఎల్ఏతో బహిరంగ క్షమాపణ చెప్పించారు. అది చాలదన్నట్లుగా పోలీసులతో కేసు నమోదు చేయించి విచారణ జరుపిస్తున్నారు. విచారణ అన్నాక కేసు ఎలాగూ కోర్టకు వెళ్ళక తప్పదు కదా? అక్కడేం జరుగుతుందో చూడాలి.
సరిగ్గా ఇక్కడే అందరి దృష్టీ చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై పడింది. ఇటువంటి ఘటనే గనుక ఏపిలో జరిగి ఉంటే ఏమయ్యేది? సింపుల్, ఏమీ జరిగేది కాదు. అధికారస్ధాయిని బట్టి చంద్రబాబు వ్యవహరించేవారు. కలెక్టర్, అంతకుమించిన స్ధాయి అయితే, సింపుల్ గా సదరు ప్రజాప్రతినిధితో క్షమాపణ చెప్పించేసి వివాదాన్ని సెటిల్ చేసేస్తారు. దిగువస్ధాయి అధికారి అయితే, అధికారిదే తప్పని తేల్చేస్తారు. ఎందుకంటే రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యం, ఎంఆర్ఓ వనజాక్షి కేసుల్లో జరిగిందదే కాబట్టి.
వనజాక్షిపై ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ అనుచరులతో దాడి చేస్తే ఎంఆర్ఓదే తప్పని తేల్చేసారు చంద్రబాబు. అదే బాలసుబ్రమణ్యం విషయంలో ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు దురుసుగా వ్యవహరించారు. వివాదం మీడియాలో రాగానే భయపడిన చంద్రబాబు ఎంపితో కమీషనర్ కు సింపుల్ గా తన కార్యాలయంలో చంద్రబాబు క్షమాపణ చెప్పించేసారు. జరిగిన ఘటనపై ఒక్క ఐఏఎస్ అధికారి కూడా నోరు విప్పలేదు.
తర్వాత ఓ బస్సు ప్రమాద ఘటనలో మృతుల బాధితుల తరపున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్, వైద్యుడిని నిలదీస్తే వెంటనే కేసు నమోదు చేసేసారు. పీలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించేసింది. సరే, టిడిపి నేతలు ఎంత రచ్చ చేసారో అందరూ చూసిందే. టిడిపి నేతల విషయంలో ఒకలాగ, ప్రతిపక్షం విషయంలో మరొక లాగ చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. కానీ శంకర్ నాయక్ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధే. అయినా కెసిఆర్ గట్టిచర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలోనే ఇద్దరు సిఎంల వ్యవహారశైలిపై రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.