రఘురామపై థర్డ్ డిగ్రీ... ఆర్మీ డాక్టర్ల నివేదికలో ఏముందంటే?: ఎమ్మెల్సీ మంతెన

By Arun Kumar PFirst Published May 23, 2021, 1:14 PM IST
Highlights

ప్రభుత్వ లోపాలను పదేపదే ప్రశ్నిస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామపై కక్ష తీర్చుకునేందుకు వైసిపి సర్కార్ తప్పుమీద తప్పులు చేశారని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. 

గుంటూరు: నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుపై సిఐడి కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగినట్లు ఆర్మీ నివేదికతో తేలిపోయిందని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోం మంత్రి మేకతోటి సుచరిత ఎందుకు నోరు మెదపడం లేదు? అని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత దాడే అనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయని మంతెన ఆరోపించారు. 

''రాష్ట్రంలో ఒక ఎంపి స్థాయి వ్యక్తికే ఈ రకమైన పరిస్థితులు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు ఏనాడో పాతరేశారు. రూల్ ఆఫ్ లా ను తుంగలో తొక్కారు'' అని అన్నారు. 

read more  రఘురామ కాలి ఎముక విరిగింది: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదిక సంచలనం

''ప్రభుత్వ లోపాలను పదేపదే ప్రశ్నిస్తున్న రఘురామపై కక్ష తీర్చుకునేందుకు తప్పుమీద తప్పులు చేశారు. హైకోర్టు, ఎసిబి కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పులను లెక్కచేయకుండా జైలుకు తరలించారు. పార్లమెంటు సభ్యుడైన ఎంపి రఘురామపై అనుచితంగా ప్రవర్తించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్థారించింది. కాబట్టి ఈ కేసును లోక్ సభ స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ కింద పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు పెద్దలపై చర్యలు చేపట్టాలి'' అని కోరారు. 

''రఘురామ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులందరినీ తక్షణమే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. వైద్య పరీక్షలపై తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యబృంధంపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రఘురామ ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది'' అని మంతెన పేర్కోన్నారు.

click me!