బైక్ పై నుంచి పడిపోతున్నట్లు నటించి, సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను కొట్టేసేందుకు యత్నించారు దొంగలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో దొంగలు దొంగతనాలు అర్ధరాత్రి వేళ చేసేవారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి వారు కూడా మారిపోయారు. పట్టపగలు, నడిరోడ్డుపై ఎవరికీ అనుమానం రాకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. బైక్ పై నుంచి పడిపోతున్నట్లు నటించి, సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను కొట్టేసేందుకు యత్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన జరిగింది. నగరంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం గాలిగోపురం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓ వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడిపోతున్నట్లు బైక్‌పై వున్న యువకుడు నాటకం ఆడాడు. అక్కడికి దగ్గరలోనే వున్న మంగళగిరికి చెందిన రామనాధం భాస్కర్ అనే వ్యక్తి బైక్‌ను ఎత్తేందుకు సాయం చేయబోయాడు. ఇంతలో అక్కడికి దగ్గరలో కాపు కాసిన మరో యువకుడు తాను కూడా సాయం చేస్తున్నట్లు నటించాడు. న్యూస్ పేపర్ అడ్డుపెట్టి భాస్కర్ జేబులో వున్న ఫోన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.
undefined
దీనిని పసిగట్టిన భాస్కర్ వెంటనే స్పందించి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆయనపై దాడి చేసి , ఫోన్‌ను అక్కడే పడేసి ఊడాయించారు. అయితే మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఇలాంటి ఘటను నిత్యకృత్యమయ్యాయి. యాత్రికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభానికి నోచుకోవవడం లేదు. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.