ఆంధ్రపదేశ్ లో 25కి 21 ఎంపీ స్థానాలను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులోనూ కీలకమయ్యారు. కేంద్ర కేబినెట్ లోనూ వీరికి చోటు దక్కనుంది. కేంద్ర మంత్రులు కాబోయే ఏపీ ఎంపీలు ఎవరంటే...?
జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు. ఎన్‌డీయే ప్రభుత్వంలో ఆయన కీలక కానున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు స్థానం ఖాయమైనట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 21 పార్లమెంటు స్థానాలను ఎన్‌డీయే కూటమి గెలుచుకుంది. అందులో పెద్ద షేర్ తెలుగుదేశందే. ఆ పార్టీ అభ్యర్థులు 16 మంది ఎంపీలుగా గెలిచారు. ఇప్పుడు ఈ సంఖ్యే ఎన్‌డీయేకి కీలకం. దీంతో ఎన్‌డీయేని డిమాండ్ చేసే స్థాయికి టీడీపీ చేరింది. కేంద్ర మంత్రివర్గంలో కనీసం రెండు నుంచి నాలుగు స్థానాలు తెలుగుదేశం ఎంపీలకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్‌డీయే నేతగా మోదీని చంద్రబాబు బలపరిచారు. ఈ క్రమంలో రెండు కేంద్ర క్యాబినెట్ పదవులు, మరో రెండు సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని పార్టీ వర్గాలు అంచనా. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు ఈ విషయమై బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 9న ప్రధాని మోదీతో పాటు తెలుగుదేశం సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీలందరూ ఢిల్లీకి చేరుకున్నారు.
undefined
అవకాశం వీరికే....
టీడీపీ ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం) కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన నేతగా, దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు వారసుడిగా ఆయనకెంతో మంచి పేరుంది. మరోవైపు చంద్రబాబుకు, టీడీపీ అగ్రనేతలకు ఆయన చాలా సన్నిహితుడు కూడా. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజాగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
చంద్రబాబుకు సన్నిహితుడైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు హరీష్. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈసారి ఎంపీగా గెలిచారు.
వీరితో పాటు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ అయిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, చిత్తూరు ఎంపీ ప్రసాదరావులలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇకపోతే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, , నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, , నంద్యాల బైరెడ్డి శబరిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బాలశౌరికి అవకాశం..!
టీడీపీ సభ్యులతో జనసేన, బీజేపీ సభ్యులు కూడా కేంద్ర కేబినెట్ పదవులు దక్కించుకోనున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీల్లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాగా, మూడోసారి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. జనసేన కూడా ఎన్‌డీయేలో కీలక భాగస్వామి అయినందున బాలశౌరి పేరు పరిశీలనకు వచ్చే అవకాశముంది.
ఇద్దరా.. ఒకరా..?
ఇక, భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేత సీఎం రమేష్ పేర్లూ వినిపిస్తున్నాయి. పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి ఎంపీ విజయం సాధించగా... సీఎం రమేశ్ రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరూ లేదా ఇద్దరిలో ఒకరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.