కోడ్‌ ఎత్తివేత... ఇక సంబరాలే సంబరాలు

By Galam Venkata RaoFirst Published Jun 6, 2024, 10:25 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ని ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. అలాగే, ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన కొత్త ఎమ్మెల్యే జాబితాను సీఈవో ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ కు అందజేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్‌ అమల్లోకి వచ్చింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి  48 గంటల వరకు అమల్లో కూడా అమలులో ఉంది. ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగా... ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేసినట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును గురువారం సాయంత్రం నుంచి నిలుపుదల చేసినట్లు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. 

ముగిసిన ఎన్నికల ప్రక్రియ 

Latest Videos

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ముగించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిఫల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ రవీంధర్ కుమార్ తదితరులు  రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి.. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యుల జాబితాను గవర్నర్‌కు అందజేశారు.

మొదటి, చివరి నియోజకవర్గం టీడీపీదే...

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13న ఎన్నికలు జరిగాయి. వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేయగా... 11 స్థానాలకే పరిమితమైంది. ఎన్‌డీయే కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీచేసి 135 గెలిచింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలను గెలుచుకుంది. ఇక, బీజేపీ పోటీ చేసిన 10చోట్ల పోటీ చేసి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేసింది. కాగా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిదైన ఇచ్ఛాపురం (బెందాళం అశోక్‌), చివరిదైన కుప్పం(చంద్రబాబు నాయుడు) నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీనే గెలుచుకుంది. కాగా, ఈ నెల 6వ తేదీ వరకు ా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రాజకీయ పార్టీల సంబరాలపై నిషేధం ఉంది. గురువారంతో కోడ్, ఆంక్షలు ముగియడంతో ఏపీలో విజయ దుందుబి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ సంబరాలతో హోరెత్తించనున్నాయి.

 

ముగిసిన డ్రైడే..

ఆంధ్రప్రదేశ్ లో  గురువారం వరకు కోడ్ అమలులో ఉండటంతో పాటు డ్రై డే పాటించారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించి.. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్ లు మూసివేశారు. దీంతో ఎక్కడా చుక్క మందు దొరక్క మద్యం ప్రియులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనుండటంతో మందుబాబులు పండగ చేసుకోనున్నారు. 

 

click me!