జగన్ మాకు ప్రత్యర్థే, పవన్ కల్యాణ్ తోనే దోస్తీ: సునీల్ దియోధర్

By telugu teamFirst Published Feb 15, 2020, 1:18 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎన్డీఎలో చేరుతుందనే వార్తల నేపథ్యంలో బిజెపి ఏపీ ఇంచార్జీ సునీల్ దియోధర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తో తమకు ఏ విధమైన పొత్తు కూడా ఉండదని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎలో చేరవచ్చుననే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దియోధర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రచారంపై శనివారం మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో తమకు ఏ విధమైన పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని తాము రాజకీయ శత్రువుగానే చూస్తున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని తాము సమానమైన రాజకీయ శత్రువులుగా పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు.

Also Read: ఎన్డీఎలోకి జగన్, చిరంజీవికి రాజ్యసభ సీటు: బొత్స మాటల ఆంతర్యం ఇదేనా?

శత్రువు అనే పదం కఠినమైందని, ఆ రెండు పార్టీలు తమకు రాజకీయ ప్రత్యర్థులని ఆయన చెప్పారు. తాము వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామని చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు.

Also Read: ఏ ముఖం పెట్టుకుని ఎన్డీఎలోకి వెళ్తారు: బొత్స వ్యాఖ్యలపై రామకృష్ణ ఫైర్

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని ఆయన అన్నారు. జనసేనతో కలిసి వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలనేది తమ వైఖరి అని,  అయితే రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనిదే అని ఆయన చెప్పారు.

పవన్ కల్యాణ్ నటుడిగా ఉండి రాజకీయ నాయకుడయ్యారని, చంద్రబాబు రాజకీయ నాయకుడిగా ఉండి నటుడిగా మారాడని ఆయన అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రమాదకరమైన పార్టీలని ఆయన అన్నారు.

click me!