గౌతమ్ వ్యాఖ్యల వెనుక అసలు కథేంటి?

First Published Sep 4, 2017, 2:08 PM IST
Highlights
  • వంగవీటి రంగా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండైన గౌతమ్ రెడ్డి విషయంలో అసలు కథేంటి?
  • ఎందుకని హటాత్తుగా రంగా గురించి అంతటి మాటలు అన్నారు అన్న విషయమై ఇపుడు చర్చ జరుగుతోంది
  • రంగా కొడుకు రాధాకృష్ణ, గౌతమ్ ఇద్దరూ వైసీపీ నేతలే. అయితే ఇద్దరికీ ఒక్క క్షణం కుడా పడదు.
  • ఇటువంటి నేపధ్యంలోనే భారతీయ జనతా పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ను జగన్ పార్టీలోకి తీసుకొచ్చారు
  • విజయవాడలో పార్టీని మరింత బలోపేతం చేయటంలో భాగంగా కాంగ్రెస్ నేత, రంగా శిష్యుల్లో ఒకరైన మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణును కూడా జగన్ పార్టీలోకి చేర్చుకున్నారు.

వంగవీటి రంగా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండైన గౌతమ్ రెడ్డి విషయంలో అసలు కథేంటి? ఎందుకని హటాత్తుగా రంగా గురించి అంతటి మాటలు అన్నారు అన్న విషయమై ఇపుడు చర్చ జరుగుతోంది. రంగా గురించి, రంగాకున్న ఇమేజ్ గురించి గౌతమ్ రెడ్డికి కొత్తగా ఇంకోరు చెప్పాల్సిన పనిలేదు. రంగా విజయవాడకు చెందిన వ్యక్తే అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు తెలీని వారుండరు దాదాపుగా. రంగా చనిపోయి దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ రంగా పేరు చెబితే కాపుల్లో ఉత్తేజం పొంగుతుంది. అంతటి ఘన చరిత్ర కలిగిన వ్యక్తి గురించి గౌతమ్ ఎందుకు అంత చవకబారుగా మాట్లాడారు?

అంటే, వైసీపీ వర్గాలు కొన్ని ఆసక్తకరమైన విషయాలను చెబుతున్నారు. రంగా కొడుకు రాధాకృష్ణ, గౌతమ్ ఇద్దరూ వైసీపీ నేతలే. అయితే ఇద్దరికీ ఒక్క క్షణం కుడా పడదు. దాంతో ఇద్దరిదీ రెండు దారులన్నట్లుగా సాగుతోంది ఇంతకాలం. వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరులో పార్టీ దెబ్బతిన్నమాట వాస్తవం. ఇటువంటి నేపధ్యంలోనే భారతీయ జనతా పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ను జగన్ పార్టీలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా నగర అధ్యక్ష బాధ్యతలు వెల్లంపల్లికి అప్పగించారు. అప్పటి వరకు అధ్యక్షునిగా రాధా ఉండేవారు. ఎప్పుడైతే వెల్లంపల్లి బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి పార్టీలో చురుకుదనం వచ్చింది.

అదే సమయంలో గౌతమ్ కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జగన్ నుండి స్పష్టమైన హామీ రాలేదట. ఇటు రాధాకు అటు వెల్లంపల్లికి హామీ ఇచ్చిన జగన్ తనకు మాత్రం ఎందుకివ్వలేదన్న విషయాన్ని గౌతమ్ జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో విజయవాడలో పార్టీని మరింత బలోపేతం చేయటంలో భాగంగా కాంగ్రెస్ నేత, రంగా శిష్యుల్లో ఒకరైన మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణును కూడా జగన్ పార్టీలోకి చేర్చుకున్నారు.

అసలే రాధా, వెల్లంపల్లితో పడని గౌతమ్ కు మల్లాది రాక మరింత ఇబ్బందికరంగా తయారైందట. ఎలాగంటే, గౌతమ్ కు మల్లాదితోనూ సరైన సంబంధాలు లేవు. దానికితోడు వాళ్ళ ముగ్గురి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో గౌతమ్ లో అభద్రత మొదలైంది. దానికితోడు ముగ్గురికి టిక్కట్ల విషయంలో జగన్ హామీ ఇచ్చారని కుడా ప్రచారం జరుగుతోంది. అంటే, టిక్కెట్టు హామీ లేనిది ఒక్క గౌతమ్ కే. దాంతో పార్టీలో ఉండి ఉపయోగం లేదనుకున్నారట. అందుకే ప్రత్యమ్నాయంగా భాజపాతో టచ్ లోకి వెళ్ళారని ప్రచారం మొదలైంది.

భాజపాలో స్పష్టమైన హామీ లభించటంతో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారట. అదే సమయంలో ఓ టివి ఛానల్ కుడా గౌతమ్ ను ఇంటర్వ్యూ చేసింది. దాన్ని అవకాశంగా తీసుకున్న గౌతమ్ వంగవీటి రంగా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాను చేసిన వ్యాఖ్యలపై పార్టీ తనపై చర్యలు తీసుకుంటుదని తెలీనంత అమాయకుడేమీ కాదు కదా? అయినా చేసారంటే అర్ధమేంటి? ఇక్కడే గౌతమ్ ఉద్దేశ్యం స్పష్టమవుతోంది.

 

 

 

 

click me!