ఇంతకీ....ఎవరీ బుట్టా రేణుక

First Published Oct 17, 2017, 3:29 PM IST
Highlights
  • బుట్టా రేణుక...పరిచయం అవసరం లేని పేరు.  2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్ధానంలో వైసీపీ తరపున గెలిచారు.
  • మంగళవారం ఉదయం టిడిపిలోకి ఫిరాయించారు. చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశంపార్టీ కండువా కప్పుకున్నారు.
  • కర్నూలు జిల్లాలోని పత్తికొండ బుట్టా స్వస్ధలం. 1971, జూన్ 21వ తేదీన పుట్టారు.
  • 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోటీశ్వరులైన ఎంపిల్లో బుట్టా కూడా ఒకరు. అఫిడవిట్ ప్రకారమే రూ. 300 కోట్ల ఆస్తులున్నాయ్.
  • పార్లమెంట్ వెబ్ సైట్ వివరాల ప్రకారం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేసినట్లుంది.
  • ప్రజ్వల స్వచ్చంధ సంస్ధతోను, క్యాన్సర్ రోగంపై చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం కూడా పాటుపడుతుంటారు.

బుట్టా రేణుక...పరిచయం అవసరం లేని పేరు.  2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్ధానంలో వైసీపీ తరపున గెలిచారు. మంగళవారం ఉదయం టిడిపిలోకి ఫిరాయించారు. చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశంపార్టీ కండువా కప్పుకున్నారు. ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి బుట్టా రేణుక గురించి అందరూ వాకాబు చేయట మొదలుపెట్టారు.

ఇంతకీ బుట్టా రేణుక ఎవరు ? కర్నూలు జిల్లాలోని పత్తికొండ బుట్టా స్వస్ధలం. 1971, జూన్ 21వ తేదీన పుట్టారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేసారు. భర్త బుట్టా నీలకంఠం. దశాబ్దాల క్రితమే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. హైదరాబాద్ లోని ప్రముఖ విద్యాసంస్ధల్లో ఒకటైన ‘మెరిడియన్’ వీరిదే. అంతేకాకుండా మద్యం వ్యాపారంలో కూడా ఉన్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోటీశ్వరులైన ఎంపిల్లో బుట్టా కూడా ఒకరు. అఫిడవిట్ ప్రకారమే రూ. 300 కోట్ల ఆస్తులున్నాయ్.

కర్నూలులో బుట్టా ఫౌండేషన్ స్ధాపించటం ద్వారా పేద, ప్రతిభ కలిగిన విద్యార్ధులకు స్కాలర్షిప్పులు పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటం, మహిళా సాధికారత తదితర అంశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అంటే విద్యావంతురాలి క్రిందే లెక్క. అయితే, పార్లమెంట్ వెబ్ సైట్ వివరాల ప్రకారం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేసినట్లుంది. బిసి చేనేత కుటుంబం నుంచి వచ్చింది.సాధారణంగా   ఈ నియోజకవర్గం నుంచి  మహిళను పోటీ పెట్టడం విశేషం. గతంలో ఎపుడో యశోదా రెడ్డి (1962-67) లో పోటీ చేశారు. మళ్లీ రేణుకయే మహిళా అభ్యర్థి. ఈ నియోజకవర్గం కోట్ల కుటుంబానికి పెట్టని కోట. బిసి పద్మశాలి కుటుంబం కావడం, అర్ధిక వనరులు ఆమెకు టికెట్ వచ్చేందుకు దోహదపడ్డాయి.

అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ప్రజ్వల స్వచ్చంధ సంస్ధతోను, క్యాన్సర్ రోగంపై చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం కూడా పాటుపడుతుంటారు. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, సంగీతం, నాటకరంగంపైన ఆసక్తి ఉన్నది. రోటరీ క్లబ్, జైబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్, గోల్ఫ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో సభ్యురాలు. చైనా, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, థాయ్ ల్యాండ్, యుఏఈ, యుకె దేశాల్లో పర్యటించారు.

ఎటువంటి రాజకీయ నేపధ్యం లేని బుట్టాను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదరించి టిక్కెట్టిచ్చి కర్నూలు ఎంపిగా పోటీ చేయించారు. అటువంటిది ఈరోజు టిడిపిలోకి ఫిరాయించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, మూడున్నరేళ్ళుగా బుట్టా ఎన్నడూ కర్నూలు అభివృద్ధి గురించి పోరాటం చేసినట్లు లేదు. కర్నూలు జిల్లాలో చెప్పుకోతగ్గ భారీ పరిశ్రమ ఒకటి కూడా లేదు. వాటి గురించి ఏనాడు ప్రశ్నించినట్లు లేదు.

పైగా అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నదీ చంద్రబాబు అసెంబ్లీలోనే చదివి వినిపించారు. ఆ జాబితా ప్రకారమే కర్నూలూకు చాలా పరిశ్రమలే రావాలి. కానీ సిఎం హామీ ప్రకారం జిల్లాకు రావాల్సిన పరిశ్రమల గురించి ఏనాడు అడిగినట్లు కూడా కనబడలేదు. అదే సమయంలో ప్రత్యేకహోదా గురించి వైసీపీ జరిపిన ఆందోళనల్లో బుట్టా కూడా పాల్గొన్నారు. పైగా ఆందోళనల్లో చంద్రబాబునాయడుపై అనేకమార్లు విరుచుకుపడ్డ విషయం అందరూ చూసిందే. చంద్రబాబు వల్లే రాష్ట్రాభివృద్ధి సరిగా జరగటం లేదని కూడా అనేకమార్లు ఆరోపించారు.

అటువంటిది పార్టీ మారే స‌రికి అభివృద్ధి గుర్తుకు వ‌చ్చింది. టిడిపిలో చేరిన తర్వాత బుట్టా మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో భాగ‌మయ్యేందుకే పార్టీ మారుతున్న‌ట్లు చెప్పటం విచిత్రంగా ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్రబాబే హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశార‌ని, ఆర్థిక లోటుతో ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నార‌న్నాని సిఎంను ఆకాశానికి ఎత్తేసారు. రాష్ట్రంలో జరిగిన నదుల అనుసంధానాన్ని వేరే రాష్ట్రాల ఎంపీలు మెచ్చుకుంటున్నారని, ఇది త‌న‌ను ఆలోచింపజేసి.. పార్టీ మారేలా చేసింద‌ని చెప్పటం గమనార్హం.

 

 

 

 

click me!