
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కొత్త కేబినెట్ నేడు కొలువుదీరనుంది. పాత, కొత్త కలయికతో ఈ కేబినేట్ రూపుదిద్దుకుంది. సామాజికవర్గాల ఆధారంగా ఈ మంత్రివర్గాన్ని ఎంపిక చేశారు. పార్టీకి మొదటి నుంచి విదేయతగా ఉన్న వారికి, ప్రతిపక్ష అధినేత హోదాలో ఉన్నప్పటి నుంచి జగన్ వెంట నడిచిన వారికి, అలాగే ఇంకా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త మంత్రులను ఎంపిక చేశారు.
జగన్ కేబినెట్ లో మంత్రులుగా ఎవరు ఉంటారనే విషయంలో నిన్న స్పష్టమైంది. శ్రీరామనవమి సందర్భంగా ఏపీ ప్రభుత్వం దీనిని ప్రకటించింది. అయితే ఈ కొత్త మంత్రి వర్గంపై కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తమకు స్థానం దక్కలేదని కొందరు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. కాగా.. మంత్రి వర్గంలో 8 జిల్లాలకు ఎలాంటి ప్రాతినిధ్యమూ దక్కలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల నుంచి మంత్రులుగా ఎవరికి అవకాశం రాలేదు.
అయితే కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా మంత్రి వర్గంలో చోటు దక్కింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా మంత్రులుగా ఎంపికయ్యారు. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కింది.
సీఎం జగన్ కేబినెట్ లో మొత్తంగా 25 మందికి చోటు దక్కింది.ఈ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ద్వారా మంత్రిమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 17 మందికి చోటు కల్పించారు. ఇందులో బీసీలు, మైనార్టీలకు కలిపి 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 చొప్పున కేటాయించారు. అంటే మంత్రిమండలిలో 68 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు స్థానం దక్కింది. 25 మంది కొత్త మంత్రులలో ఓసీలు 8 మంది ఉన్నారు. 2019 నాటి జగన్ తొలి కేబినెట్లో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఈ కొత్త కేబినెట్ లో నలుగురు మహిళలకు అవకాశం దక్కింది.