
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసమంటూ తాడేపల్లిలోని ఆయన నివాసానికి సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు సరయిన న్యాయం చేయకుండానే ఇళ్లను ఖాళీచేస్తున్నారని నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు. ఇలా ఆందోళనలో పాల్గొంటున్న తనకు, తన కుటుంబానికి అధికార పార్టీకి చెందిన వారితో ప్రాణహాని వుందని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాడేపల్లి అమరారెడ్డి నగర్ నిర్వాసితురాలు వడియం శివ శ్రీ అనే మహిళ తనను కొందరు బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ ప్రభుత్వం న్యాయం చేసేవరకు అమరారెడ్డి కాలనీ వాసులు అండగా ఉండాలని ఇటీవలే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి కోరినట్లు శివ శ్రీ తెలిపారు. ఇలా తాను పవన్ కల్యాణ్ ను కలిసినప్పటి నుండి బెదిరింపులు మొదలయ్యాయని శివ శ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.
వీడియో
తాడేపల్లి పోలీసులు తనను పోలీస్ స్టేషన్ కు పిలిచి బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఆరోపిస్తున్నారు. ఏ తప్పూ చేయకపోయినా ఓ ఆడబిడ్డను పోలీస్ స్టేషన్ కు పిలిపించడమే కాదు 6 గంటల నుంచి 10 గంటల వరకు స్టేషన్ వద్దే వుండేలా చేసి మానసిక వేధనకు గురిచేస్తున్నారని అన్నారు. సీఎం ఇంటిముట్టడిలో తన ప్రమేయమే ఎక్కువగా వుందని... కేసు నమోదు చేస్తే జీవితాలు నాశనం అవుతాయని పోలీసులు బెదిరింపులకు గురి చేశారని శివ శ్రీ ఆరోపించారు.
read more సీఎం జగన్ నివాసం వద్ద ప్లెక్సీల కలకలం
అయితే స్థానిక జనసేన నాయకురాలు సుంకర పద్మ రావడంతో పోలీసులు తనను విడిచి పెట్టారని బాధితురాలు తెలిపారు. స్థానికంగా వుండే అన్ని పార్టీల నాయకులు కూడా తమకే సహకరిస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటికీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని బాధిత మహిళ శివశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.