
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఉండవల్లి నివాసం (undavalli house) వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు నివాసముండే ఇంటిపక్కనే వున్న తన 8సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఓ బాధితుడు ఆందోళనకు దిగాడు. ఇతడికి జనసేన నాయకులు కూడా మద్దతు తెలపడంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామపరిధిలో కృష్ణా నది ఒడ్డున లింగమనేని రమేష్ కు కు చెందిన ఇంట్లో చంద్రబాబు కుటుంబం నివాసముంటోంది. ఏపీ ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఇదే ఇంట్లో నివాసముంటున్నారు. అయితే ఏడేళ్ల క్రితం అంటే చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో లింగమనేని నివాసం (lingamaneni house) పక్కనే వున్న తన 8సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని శింగంశెట్టి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.
తన స్థలాన్ని కాపాడుకోడానికి ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని... అందువల్లే ఆందోళనకు దిగినట్లు శ్రీనివాసరావు తెలిపారు. కబ్జా చేసుకుని అక్రమంగా వాడుకుంటున్న తన స్థలాన్ని అప్పగించాలని చంద్రబాబును కోరడానికి వెళితే ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని శ్రీనివాస్ తెలిపారు. అందువల్లే ఇంటిముందు కూర్చుని ఆందోళనకు దిగుతున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు నివాసం వద్ద నిరసనకు దిగిన శ్రీనివాసరావుకు జనసేన పార్టీ నేతలు మద్దతు తెలిపారు. తమ పార్టీకి చెందిన శ్రీనివాసరావుకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసరావు కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదంటూ జనసేన నాయకులు కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
ఇదిలావుంటే ఉండవల్లి చంద్రబాబు నివాసముంటున్న ఇంటిపై గతంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. నిబంధనకు విరుద్దంగా ఆ ఇంటి నిర్మాణం జరిగిందంటూ యజమాని లింగమనేని రమేష్ కు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసారు. అక్రమంగా నిర్మించిన ఇంటికి కూల్చివేస్తామని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై తాజాగా లింగమనేని రమేష్ స్పందిస్తూ అన్ని అనుమతులతోనే తాను ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిపారు.
కృష్ణానది కరకట్ట మీద ఉన్నవన్నీ అక్రమ నిర్మాణాలేనని... ఇందులో చంద్రబాబు నివాసముంటున్న ఇళ్లు ఒకటని వైసిపి నాయకులు ఆరోపించారు. కాబట్టి చంద్రబాబు నివాసముంటున్న భవనాన్ని కూడా కూల్చివేయనున్నట్లు సీఆర్డీఏ ప్రకటించినా ఇప్పటివరకు కూల్చివేత మాత్రం జరగలేదు.
ఈ నివాసం అసలు యజమాని లింగమనేని కాగా.... దాంట్లో చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి అందులో అద్దెకు నివసిస్తున్నారు. వైసిపి అధికారంలోకి రాగానే చంద్రబాబు నివాసానికి సమీపంలోని ప్రజా వేధికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేసారు ఇప్పుడు చంద్రబాబు నివసిస్తున్న ఈ ఇంటిని కూడా కూల్చేయాలని చూసింది. కానీ అది జరగలేదు.