నారా లోకేష్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత.. మాట్లాడకుండా అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పై నిల్చొని నిరసన..

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 4:50 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం ఉదయం గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. అయితే లోకేష్ పాదయాత్ర సంసిరెడ్డిపల్లెకు చేరుకున్న సమయంలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. అయితే సంసిరెడ్డిపల్లెలో లోకేష్ మాట్లాడకుండా అడ్డుకున్నారు. మైక్ తీసుకొస్తున్న బాషా అనే కార్యకర్త నుంచి మైక్ ను లాక్కున్నారు. అదే విధంగా లోకేష్ నిల్చున్న స్టూల్‌ను కూడా పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలలోనే చాలా సేపు స్టూల్ మీదే నిలబడి లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భారత రాజ్యాంగం పుస్తకాన్ని చూపిస్తూ పోలీసులపై లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమది అంబేడ్కర్ రాజ్యాంగం అని అన్నారు. కొందరు పోలీసుల వల్ల పోలీశాఖకే చెడ్డ పేరు వస్తుందని అన్నారు. 

ఇదిలా ఉంటే.. నారా లోకేష్‌పై మరో క్రిమినల్ కేసు నమోదైంది. అనుమతి లేకుండా సమావేశాన్ని నిర్వహించారని, పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించారని చిత్తూరు నర్సింగరాయపేట పోలీసులు కేసు నమోదుచేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.

click me!