ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహారీ గోడ నిర్మాణం తాడిపత్రిలో ఉద్రిక్తతకు కారణమైంది. మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ప్రహారీ గోడ నిర్మించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు.
తాడిపత్రి: నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహారీగోడను అధికారులు నిర్మిస్తున్నారు. రోడ్డుకు 60 ఫీట్లు వదిలి గోడ నిర్మాణం చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గోడ నిర్మాణాన్ని అడ్డుకోకుండా భారీగా పోలీసులను మోహరించి గోడను నిర్మిస్తున్నారు.
గతంలో ఈ గోడ నిర్మాణాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డికి అధికారులు 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు తీసుకొనేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాకరించారు.నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ చుట్టూ ఏడు అడుగుల ఎత్తులో ప్రహారీ గోడ నిర్మించాల్సి ఉంది. ఈ గోడ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ఉంటుంది.
undefined
1983 లేఔట్ ప్రకారంగా 50 అడుగులు,2022 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 60 అడుగులు కట్టాలి.అయితే కొలతలు వేసి ప్రహారీగోడ నిర్మించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. తాను ప్రహారీగోడ నిర్మాణానికి వ్యతిరేకం కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావద్దనేది తన ఉద్దేశ్యంగా ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రహారీగోడ నిర్మాణాన్ని అడ్డుకున్నారనే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రహారీ గోడ నిర్మాణానికి సంబంధించిన ఫిల్లర్లను ధ్వంసం చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.ఈ గోడ నిర్మాణం విషయమై గత రెండు మూడు రోజులుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతుంది.